ఐటీసీ లాభం రూ. 2,425 కోట్లు | Sakshi
Sakshi News home page

ఐటీసీ లాభం రూ. 2,425 కోట్లు

Published Sat, Nov 1 2014 12:37 AM

ఐటీసీ లాభం రూ. 2,425 కోట్లు

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్(క్యూ2) లో డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ రూ. 2,425 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది (2013-14) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 2,230 కోట్లతో పోలిస్తే ఇది నామమాత్ర వృద్ధికాగా, ఎఫ్‌ఎంసీజీ, సిగరెట్ల బిజినెస్‌లో సాధించిన పురోగతి ఇందుకు దోహదపడింది. స్టాండెలోన్ ప్రాతిపదికన ఆదాయం రూ.7,863 కోట్ల నుంచి రూ.9,024 కోట్లకు ఎగసింది. అయితే విమ్కోకు చెందిన ఇంజనీరింగ్‌యేతర బిజినెస్‌ను విడదీసి, కంపెనీలో విలీనం చేసినందున ఫలితాలను పోల్చిచూడలేమని ఐటీసీ పేర్కొంది.
 
ప్రతికూల పరిస్థితుల్లోనూ: క్యూ2లో సిగరెట్ల బిజినెస్ నుంచి రూ.4,251 కోట్ల ఆదాయం లభించింది. గతంలో ఇది రూ. 3,724 కోట్లు. ఎఫ్‌ఎంసీజీ విభాగం నుంచి రూ. 6,447 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో ఇది రూ. 5,686 కోట్లు మాత్రమే. పన్నుల పెంపు, చట్టవిరుద్ధ తయారీ, స్మగ్లింగ్ వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సిగరెట్ల బిజినెస్‌లో వృద్ధిని సాధించినట్లు కంపెనీ పేర్కొంది. సిగరెట్ ప్యాక్‌పై 85% వరకూ చట్టబద్ధ హెచ్చరికలతోనే నింపమంటూ జారీ అయిన ప్రభుత్వ ఆదేశాల కారణంగా బిజినెస్‌కు విఘాతం కలిగే అవకాశముం దని తెలిపింది. వ్యవసాయ బిజినెస్ ఆదాయం రూ. 1,772 కోట్ల నుంచి రూ. 2,059 కోట్లకు పుంజుకుంది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్‌ఈలో నామమాత్ర లాభంతో రూ. 355 వద్ద ముగిసింది.

Advertisement
Advertisement