breaking news
Net profit Q2
-
కోటక్ లాభం 2,407 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.2,407 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం(రూ.1,747 కోట్లు)తో పోల్చితే 38 శాతం వృద్ధి సాధించామని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.10,829 కోట్ల నుంచి రూ.12,543 కోట్లకు పెరిగిందని పేర్కొంది. స్టాండ్అలోన్ పరంగా చూస్తే, గత క్యూ2లో రూ.1,142 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 51 శాతం వృద్ధితో రూ.1,724 కోట్లకు పెరిగిందని వివరించింది. రూ.3,350 కోట్లకు నికర వడ్డీ ఆదాయం.... పన్ను వ్యయాలు తక్కువగా ఉండటం, నికర వడ్డీ ఆదాయం అధికంగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. తమ కన్సాలిడేటెట్ లాభంతో అనుబంధ సంస్థల వాటా 28 శాతంగా ఉందని వివరించింది. నికర వడ్డీ ఆదాయం రూ.2,676 కోట్ల నుంచి 25 శాతం వృద్ధితో రూ.3,350 కోట్లకు పెరిగిందని తెలిపింది. గత క్యూ2లో 4.19 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్ ఈ క్యూ2లో 4.61 శాతానికి పెరిగిందని పేర్కొంది. రుణ వృద్ధి 21 శాతం నుంచి 15 శాతానికి తగ్గిందని తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఈ క్యూ1లో రుణ వృద్ధి 18 శాతమని పేర్కొంది. తగ్గిన రుణ నాణ్యత... ఈ బ్యాంక్ రుణ నాణ్యత ఒకింత తగ్గింది. గత క్యూ2లో రూ.4,302 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.5,475 కోట్లకు పెరిగాయని బ్యాంక్ పేర్కొంది. అలాగే నికర మొండి బకాయిలు రూ.1,618 కోట్ల నుంచి రూ.2,032 కోట్లకు పెరిగాయని వివరించింది. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 1.91 శాతం నుంచి 2.17 శాతానికి, నికర మొండి బకాయిలు 0.73 శాతం నుంచి 0.82 శాతానికి పెరిగాయని పేర్కొంది. కేటాయింపులు రూ.360 కోట్ల నుంచి రూ.473 కోట్లకు పెరిగాయని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ 0.8 శాతం లాభంతో రూ.1,629 వద్ద ముగిసింది. -
ఐటీసీ లాభం రూ. 2,425 కోట్లు
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్(క్యూ2) లో డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ రూ. 2,425 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది (2013-14) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 2,230 కోట్లతో పోలిస్తే ఇది నామమాత్ర వృద్ధికాగా, ఎఫ్ఎంసీజీ, సిగరెట్ల బిజినెస్‌లో సాధించిన పురోగతి ఇందుకు దోహదపడింది. స్టాండెలోన్ ప్రాతిపదికన ఆదాయం రూ.7,863 కోట్ల నుంచి రూ.9,024 కోట్లకు ఎగసింది. అయితే విమ్కోకు చెందిన ఇంజనీరింగ్యేతర బిజినెస్‌ను విడదీసి, కంపెనీలో విలీనం చేసినందున ఫలితాలను పోల్చిచూడలేమని ఐటీసీ పేర్కొంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ: క్యూ2లో సిగరెట్ల బిజినెస్ నుంచి రూ.4,251 కోట్ల ఆదాయం లభించింది. గతంలో ఇది రూ. 3,724 కోట్లు. ఎఫ్ఎంసీజీ విభాగం నుంచి రూ. 6,447 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో ఇది రూ. 5,686 కోట్లు మాత్రమే. పన్నుల పెంపు, చట్టవిరుద్ధ తయారీ, స్మగ్లింగ్ వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సిగరెట్ల బిజినెస్‌లో వృద్ధిని సాధించినట్లు కంపెనీ పేర్కొంది. సిగరెట్ ప్యాక్‌పై 85% వరకూ చట్టబద్ధ హెచ్చరికలతోనే నింపమంటూ జారీ అయిన ప్రభుత్వ ఆదేశాల కారణంగా బిజినెస్‌కు విఘాతం కలిగే అవకాశముం దని తెలిపింది. వ్యవసాయ బిజినెస్ ఆదాయం రూ. 1,772 కోట్ల నుంచి రూ. 2,059 కోట్లకు పుంజుకుంది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో నామమాత్ర లాభంతో రూ. 355 వద్ద ముగిసింది.