రిటైల్‌కు రూ.5.5 లక్షల కోట్ల నష్టం 

Indian Retail Loss Of Rs 5.5 Lakh Crore - Sakshi

మూసివేత దిశగా 20% వ్యాపారాలు

ప్యాకేజీతో ఆదుకోండి:సీఏఐటీ 

ముంబై: దేశవ్యాప్తంగా ఏడు కోట్ల మంది వ్యాపారులు ఉన్న రిటైల్‌ రంగం లాక్‌డౌన్‌ కారణంగా రూ.5.5 లక్షల కోట్లు నష్ట పోయిందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) వెల్లడించింది. 20 శాతం మంది రిటైలర్లు రానున్న కాలంలో తమ వ్యాపారాలను మూసివేయనున్నట్టు తెలిపింది. ఇటువంటి కష్ట కాలంలో వర్తకులను ఆదుకోవడానికి ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రానికి విన్నవించినట్టు సీఏఐటీ సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ వివరించారు. ‘భారత వర్తకుల రోజువారీ వ్యాపారం విలువ రూ.15,000 కోట్లు. లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమకు రూ.5.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో 1.5 కోట్ల మంది వర్తకులు వ్యాపారాలను శాశ్వతంగా మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ వర్తకుల మీద ఆధారపడ్డ 75 లక్షల మంది చిరు వ్యాపారులు కూడా వీరి దారిన నడవాల్సిందే. దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మంది సూక్ష్మ, చిన్నవ్యాపారులు ఉంటారు’ అని తెలిపారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి....
‘ఈ విపత్కర పరిస్థితిని తట్టుకునే బలం వ్యాపారులకు లేదు. వర్తకులు తమ ఉద్యోగుల జీతాలు, షాపుల అద్దెలు చెల్లిస్తున్నారు. మరోవైపు కస్టమర్ల ఖర్చు చేయతగ్గ ఆదాయం తగ్గింది. ఈ పరిణామాలతో వ్యాపారాలు సాధారణ స్థితికి రావడానికి 6–9 నెలల సమయం పడుతుంది. ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. అన్ని రంగాల్లో డిమాండ్‌ తక్కువగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందన్న ఆశలు కోల్పోయాం’ అని ఖండేల్వాల్‌ వివరించారు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే ఈ రంగానికి ఊహించని నష్టం వాటిల్లుతుందని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బి.సి.భాటియా అన్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే కరోనాను మించిన ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top