స్విట్జర్లాండ్‌పై భారత్ మరింత ఒత్తిడి | India steps up pressure on Switzerland to share bank info | Sakshi
Sakshi News home page

స్విట్జర్లాండ్‌పై భారత్ మరింత ఒత్తిడి

May 3 2014 1:46 AM | Updated on Sep 2 2017 6:50 AM

పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆధారాలు లభించిన కొందరు భారతీయుల ఖాతాలకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం నిరాకరించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది.

 న్యూఢిల్లీ: పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆధారాలు లభించిన కొందరు భారతీయుల ఖాతాలకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం నిరాకరించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇరుదేశాల మధ్య ఆర్థిక సహకారం ఉండాలంటే పన్ను సంబంధ సమాచార మార్పిడి అత్యంత ముఖ్యమని హెచ్చరించింది. ద్వంద్వ పన్నుల నివారణ సదస్సులో అంగీకరించిన ప్రకారం స్విట్జర్లాండ్ ప్రభుత్వం తమ హక్కులు, బాధ్యతలను గుర్తించాలని స్పష్టం చేసింది.

కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఈ మేరకు స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రికి ఘాటైన లేఖ రాశారు. ఆయన ఇలా లేఖ రాయడం నాలుగునెలల్లో ఇది మూడోసారి. సమాచారాన్ని సమర్థంగా మార్పిడి చేసుకోవడానికి తగిన చట్ట, ప్రభుత్వ వ్యవస్థలు స్విట్జర్లాండ్‌కు లేకపోవడాన్ని గ్లోబల్ ఫోరమ్‌లో ప్రశ్నిస్తామని చిదంబరం పునరుద్ఘాటించారు. భారత్ విజ్ఞప్తికి తగినట్లుగా తాము సమాచారాన్ని పంచుకోలేమని స్విట్జర్లాండ్ పేర్కొనడం అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.

 సమాచార మార్పిడికి తాము వ్యతిరేకమంటూ స్విట్జర్లాండ్ ప్రభుత్వం గత నెల 7న చిదంబరానికి లేఖ రాసింది. దీంతో భారత ప్రభుత్వం స్విట్జర్లాండ్‌పై ఒత్తిడి మరింత పెంచుతోంది. స్విట్జర్లాండ్‌లోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు శాఖల్లో అకౌంట్లున్న కొందరు భారతీయుల జాబితాను ఫ్రాన్స్ ప్రభుత్వం ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం గతంలో భారత్‌కు అందించింది. వీరి ఖాతాల సమాచారాన్ని ఇండియా కోరగా, స్విస్ నిరాకరించింది.

 ఇండియన్ బ్యాంక్ ఎఫ్‌సీఎన్‌ఆర్ వడ్డీరేట్ల తగ్గింపు
 చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (బ్యాంకింగ్)కు సంబంధించి టర్మ్ డిపాజిట్ వడ్డీరేట్లను స్వల్పంగా తగ్గించింది. తక్షణం ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. అమెరికా డాలర్ డిపాజిట్లకు సంబంధించి యేడాది ఆపైన రెండేళ్ల వరకూ రేటు ప్రస్తుత 2.56 శాతం నుంచి 2.55 శాతానికి, 2-3 యేళ్లకాల వ్యవధి డిపాజిట్ రేటు 2.59 శాతం నుంచి 2.56 శాతానికి, 3-4 యేళ్ల వ్యవధి డిపాజిట్లపై రేటు 4.05 శాతం నుంచి 4.02 శాతానికి, 4-5 సంవత్సరాల మధ్య డిపాజిట్ రేటు 4.48 శాతం నుంచి 4.45 శాతానికి, ఐదేళ్లు పైబడిన డిపాజిట్లపై రేటు 4.85 శాతం నుంచి 4.81 శాతానికి తగ్గిస్తున్నట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement