ఆరేళ్ల తర్వాత లాభాల బాట

IHCL targets 30% growth in next few years - Sakshi

ఈ ఏడాదిలో ఇండియన్‌ హోటల్స్‌ 8 నూతన హోటళ్లు

సర్వసభ్య సమావేశంలో చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌

ముంబై: టాటా గ్రూప్‌నకు చెందిన ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐహెచ్‌సీఎల్‌) ప్రస్తుత ఏడాదిలో 8 నూతన హోటళ్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఆరేళ్ల తరవాత 2018 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మళ్లీ లాభాల బాట పట్టిందని వ్యాఖ్యానించిన చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌.. ఇక్కడ నుంచి వృద్ధిరేటు కొనసాగుతుందని, వచ్చే ఐదేళ్లలో ఆదాయం 30 శాతం వృద్ధిని సాధించాలనే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రస్తుతం 8– 10% వృద్ధితో ఉన్నట్లు కంపెనీ నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వెల్లడించారు.  

‘3ఆర్‌’ వ్యూహంలో భాగంగా నిర్మాణం, ఇంజినీరింగ్, ప్రణాళికలను పున:సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యూహం వల్ల నిర్వహణ మార్జిన్లు 800 బేసిస్‌ పాయింట్లు వృద్ధిచెందుతుందని అంచనావేశారు. జనాభా గణాంకాల అధ్యయనం సానుకూలంగా ఉందని వెల్లడించారు. మధ్యతరగతి వర్గాల ఆదాయం పెరగడం వల్ల వీరు చేస్తున్న ఖర్చులు కూడా పెరుగుతున్నాయనే అంశం హోటల్స్‌ పరిశ్రమకు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ‘‘తాజ్‌ వివాంత, జింజర్‌ బ్రాండ్లతో పాటు ’సెలక్షన్‌’ పేరుతో కొనసాగుతున్న వ్యాపారం కూడా పుంజుకుంటోంది.

ప్రయాణ, పర్యాటక రంగం ఏడాదికి 6.9 శాతం వృద్ధి చెందుతోంది. ప్రభుత్వం చేపట్టిన ’ఈ–వీసా’ స్కీమ్, విమానయాన రంగం అభివృద్ధి చెందుతున్న అంశాల నేపథ్యంలో ఆతిథ్య రంగం సైతం వృద్ధిబాట పట్టింది. ఇంతటి సానుకూల అంశాల మధ్య హోటల్‌ ఇండస్ట్రీ అక్యుపెన్సీ పెరిగి సగటు గదుల ఆదాయంలో వృద్ధిరేటు పెరుగుతుందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది’’ అని చంద్రశేఖరన్‌ వివరించారు.

గత ఆర్థిక సంవత్సరంలో రూ.101 కోట్లు నికర లాభం సాధించినట్లు తెలిపిన ఆయన రూ.4,165 కోట్లు ఆదాయం సాధించామని, ఈ క్రమంలో కంపెనీ అప్పులు రూ.5,800 కోట్ల నుంచి రూ.2,400 కోట్లకు తగ్గాయని వివరించారు. శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి ఐహెచ్‌సీఎల్‌ షేరు ధర రూ.0.90 (0.70 శాతం) తగ్గి రూ.128.25 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top