పసిడి రికవరీపై ఆశలు.. | Hopes on golden recovery | Sakshi
Sakshi News home page

పసిడి రికవరీపై ఆశలు..

Jul 2 2018 12:05 AM | Updated on Jul 2 2018 7:53 AM

Hopes on golden recovery - Sakshi

న్యూఢిల్లీ: గత కొద్దిరోజులుగా అమ్మకాల ఒత్తిడితో పన్నెండు నెలల కనిష్ట స్థాయిని తాకిన పసిడి ధరలు మళ్లీ కోలుకోగలవన్న అంచనాలు నెలకొన్నాయి. సాధారణంగా అనిశ్చితి పరిస్థితులు, వాణిజ్య యుద్ధ భయాలు నెలకొన్న సమయాల్లో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా అంతా పసిడి వైపు చూస్తారని, కానీ ప్రస్తుతం దానికి భిన్నంగా బంగారం రేటు క్షీణించడం ఆశ్చర్యపరుస్తోందని క్యాపిటల్‌ ఎకనామిక్స్‌ సంస్థ విశ్లేషకులు సిమోనా అభిప్రాయపడ్డారు.

అయితే, పసిడి ఇప్పటికే ఓవర్‌సోల్డ్‌ స్థితికి చేరిందని, ఇకపై మళ్లీ క్రమంగా రికవర్‌ కాగలదని పేర్కొన్నారు. ఔన్సు (31.1 గ్రాములు) ధర 1,250 డాలర్ల స్థాయికి పడిపోయిన నేపథ్యంలో బంగారం ప్రస్తుతం అత్యంత చౌకగా లభిస్తున్నట్లేనని టీడీ సెక్యూరిటీస్‌ విశ్లేషకులు రయాన్‌ మెకే తెలిపారు. 1,240 డాలర్ల వద్ద పసిడికి కీలక మద్దతు ఉంటుందని, 1,260–65 నిరోధంగా ఉండవచ్చని ఆయన తెలిపారు.

జూన్‌ 13న జరిగిన ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం మినిట్స్‌ ఈ వారంలో వెల్లడి కానుండటం, వ్యవసాయేతర ఉద్యోగాల కల్పన గణాంకాలు విడుదల కానుండటం పసిడిపై ప్రభావం చూపనున్నాయి. ద్రవ్యోల్బణంపై అమెరికా ఫెడ్‌ ఏ కాస్త ఆందోళన వ్యక్తం చేసినా.. బంగారం ధరల పెరుగుదలకు సానుకూలంగా ఉండగలదని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.   

ఇక దేశీయంగా చూస్తే.. అంతర్జాతీయంగా బలహీన ట్రెండ్స్‌ నేపథ్యంలో స్టాకిస్టులు, ట్రేడర్ల నుంచి డిమాండ్‌ తగ్గడంతో వరుసగా రెండో వారం కూడా పసిడి రేట్లు క్షీణించాయి. అంతక్రితం వారంతో పోలిస్తే గత వారంలో న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ. 180 మేర తగ్గింది. అదేవిధంగా మేలిమి బంగారం ధర రూ. 31,420 వద్ద, ఆభరణాల బంగారం రూ. 31,270 వద్ద క్లోజయ్యింది. వెండి రేటు కూడా కేజీకి రూ. 400 తగ్గి రూ. 40,600 వద్ద ముగిసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement