హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం రయ్‌.. | HCL Techologies Q3 results: Here's what analysts say | Sakshi
Sakshi News home page

హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం రయ్‌..

Jan 30 2019 12:43 AM | Updated on Jan 30 2019 12:43 AM

 HCL Techologies Q3 results: Here's what analysts say - Sakshi

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంచనాలు మించిన లాభాలు నమోదు చేసింది. రూ. 2,611 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ త్రైమాసికంలో నమోదైన రూ. 2,194 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 19 శాతం అధికం. మరోవైపు, సంస్థ ఆదాయం సుమారు 23 శాతం వృద్ధితో రూ. 12,808 కోట్ల నుంచి రూ. 15,699 కోట్లకు చేరింది. 2019 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్‌సీఎల్‌ రూ. 2 మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. సీక్వెన్షియల్‌గా చూస్తే స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయాలు 5.6 శాతం మేర పెరిగాయని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సీఈవో సి. విజయకుమార్‌ తెలిపారు. ‘ప్రధాన వ్యాపార విభాగం (మోడ్‌ 1) స్థిరంగా వృద్ధి చెందుతోంది. ఇక డిజిటల్‌ (మోడ్‌ 2), ఐపీ ఆధారిత వ్యాపార సేవల విభాగం (మోడ్‌ 3) కూడా రాణిస్తుండటంతో.. మొత్తం ఆదాయాల్లో ఈ రెండింటి వాటా 29 శాతానికి చేరింది. భారీ డీల్స్‌ను సక్రమంగా పూర్తి చేయగలగడం.. ఆదాయ వృద్ధికి ఊతమిస్తోంది‘ అని ఆయన తెలిపారు. డాలర్‌ మారకంలో చూస్తే డిసెంబర్‌ క్వార్టర్‌లో నికర లాభం 7 శాతం పెరిగి 364 మిలియన్‌ డాలర్లుగా నమోదు కాగా, ఆదాయం సుమారు 11% వృద్ధితో 2.2 బిలియన్‌ డాలర్లకు చేరింది. అమెరికా విభాగం 12.9%, యూరప్‌ విభాగం 14.5%, భారత్‌ మినహా మిగతా ప్రపంచ దేశాల మార్కెట్‌ విభాగం 12.1% మేర వృద్ధి నమోదు చేశాయి. ఆదాయం మెరుగ్గా ఉండటం, పన్ను భారం తగ్గడం వంటి అంశాల కారణంగా హెచ్‌సీఎల్‌ టెక్‌ అంచనాలు మించే స్థాయిలో లాభాలు ప్రకటించిందని బ్రోకరేజి సంస్థ షేర్‌ఖాన్‌ రీసెర్చ్‌ విభాగం ఏవీపీ సంజీవ్‌ హోతా చెప్పారు. 

గైడెన్స్‌పై ధీమా..: స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరంలో ముందుగా ఇచ్చిన గైడెన్స్‌ ప్రకారం 9.5–11.5% శ్రేణిలో ఆదాయ వృద్ధి ఎగువ స్థాయిలోనే ఉంటుందని విజయకుమార్‌ చెప్పారు. క్యూ3లో 17 డీల్స్‌ కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. క్యూ3లో స్థూలంగా 13,191 మంది  ని రిక్రూట్‌ చేసుకుంది. డిసెంబర్‌ చివరికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,32,328కి చేరింది. ఐటీ  విభాగంలో అట్రిషన్‌ రేటు 17.8%గా ఉంది. విదేశీ కార్యాలయాలకు సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2,000 మందిని రిక్రూట్‌ చేసుకోవాలని హెచ్‌సీఎల్‌ యోచిస్తోంది. ఇందులో సింహభాగం నియామకాలు అమెరికాలోనే ఉండనున్నాయి. ఇక భారత్‌లో 10,000 మంది ఫ్రెషర్స్‌ని తీసుకోనుంది. 

ప్రపంచవ్యాప్తంగా 134 డెలివరీ సెంటర్స్‌..
అంతర్జాతీయంగా సాఫ్ట్‌వేర్‌ సేవల్లో స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా వివిధ దేశాల్లో 134 డెలివరీ సెంటర్స్‌ ఏర్పాటు చేసుకున్నామని విజయకుమార్‌ చెప్పారు. రాజకీయ, భౌగోళిక, ఆర్థిక ప్రతిబంధకాల కారణంగా డిమాండ్, సరఫరాపరమైన సమస్యల్లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement