హార్లీ-డేవిడ్‌సన్‌కు ట్రంప్‌ సీరియస్‌ వార్నింగ్‌

Harley-Davidson Will Take Big Hit for Moving Some Production Overseas - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికాకు, యూరోపియన్‌ యూనియన్‌కు మధ్య నెలకొన్న టారిఫ్‌ వార్‌ దెబ్బకు దిగ్గజ మోటార్‌సైకిల్‌ కంపెనీ హార్లీ-డేవిడ్‌సన్‌.. అమెరికా బయట ఉత్పత్తి చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విదేశాల్లో మోటార్‌సైకిల్‌ ఉత్పత్తిని చేపట్టడానికి హార్లీ డేవిడ్‌సన్‌ తరలి వెళ్తే, అది తీవ్ర ప్రభావానికి గురి కానుందని ట్రంప్‌ హెచ్చరించారు. ఐకానిక్‌ మోటార్‌సైకిల్స్‌పై భారత్‌ దిగుమతి సుంకాలు తగ్గించినప్పటికీ, ఈ కంపెనీ చాలా కఠినమైన నిర్ణయం తీసుకుందని అన్నారు. ఒకవేళ ఉత్పత్తిని విదేశాలకు తరలిస్తే, అమెరికా కస్టమర్లను కోల్పోయే ప్రమాదముందని ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేశారు.  

’హార్లీ భారీగా దెబ్బతింటుందని నాకు అనిపిస్తుంది. ఇది గ్రేట్‌ అమెరికన్‌ ఉత్పత్తి అనుకుంటున్నా. అమెరికన్‌ ప్రజలు చాలా గర్వంగా ఫీలై, దీన్ని వాడుతూ ఉంటారు. హార్లీ గట్టి దెబ్బనే ఎదుర్కోబోతుందని నేను నమ్ముతున్నా. హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌ కొనుక్కునే వారు, దాన్ని మరో దేశంలో ఉత్పత్తి చేయాలని కోరుకోరు’ అని ట్రంప్‌ అన్నారు. అమెరికా బైక్‌  ఉత్పత్తులపై యూరోపియన్‌ యూనియన్‌ విధిస్తున్న టారిఫ్‌లను తగ్గించుకునేందుకు, హార్లీ డేవిడ్‌సన్‌ తన బైక్‌ ఉత్పత్తిని అమెరికా వెలుపల విదేశాల్లో చేపట్టాలని నిర్ణయించింది. స్టీల్‌, అ‍ల్యూమినియంపై ట్రంప్‌ టారిఫ్‌లు విధించడంతోనే, ఇతర దేశాలు కూడా ట్రంప్‌కు కౌంటర్‌గా భారీగా ఈ టారిఫ్‌లు విధించడం ప్రారంభం చేశాయి. హార్లీ డేవిడ్‌సన్‌ అనేది అమెరికన్‌ మోటార్‌సైకిల్‌ కంపెనీ. కానీ ఇటీవల టారిఫ్‌ల యుద్ధం బారీగా పెరగడంతో, ఇది విదేశాలకు తరలిపోతున్నట్టు అధికారిక ప్రకటన చేసింది. అమెరికా వెలుపల దీని ఉత్పత్తిని ప్రారంభించడానికి కనీసం 9 నుంచి 18 నెలలు పట్టే అవకాశం కనిపిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top