వరుసగా ఐదో రోజు తగ్గిన బంగారం

Gold Prices Fall For Five Straight Days - Sakshi

న్యూఢిల్లీ : బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వరుసగా ఐదో రోజూ బంగారం ధరలు కిందకి పడిపోయాయి. అంతర్జాతీయంగా ట్రెండ్‌ స్తబ్దుగా ఉండటం, స్థానిక జువెల్లర్స్‌ నుంచి డిమాండ్‌ లేకపోవడంతో గురువారం 10 గ్రాముల బంగారం ధర బులియన్‌ మార్కెట్‌లో 140 రూపాయలు తగ్గి, రూ.31,210గా నమోదైంది. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే కేజీకి 470 తగ్గినట్టు తెలిసింది. దీంతో కేజీ వెండి ధర రూ.40,030గా రికార్డైంది. పారిశ్రామిక యూనిట్ల నుంచి, కాయిన్‌ తయారీదారుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో వెండి ధరలు కూడా తగ్గాయని విశ్లేషకులు చెప్పారు. 

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ స్థిరంగా కొనసాగింది. ఒక్క ఔన్స్‌కు 1,243 డాలర్లు నమోదైంది. బుధవారం 1 శాతం కిందకి పడిపోయిన బంగారం, వారం కనిష్ట స్థాయిలను తాకింది. ఆగస్టు నెల అమెరికా గోల్డ్‌ ఫ్యూచర్స్‌ కూడా 0.1 శాతం నష్టంలో ఔన్స్‌కు 1,243.60 డాలర్లుగా నమోదైనట్టు తెలిసింది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధరలు 140 రూపాయల చొప్పున తగ్గి రూ.31,210, రూ.31,060గా నమోదయ్యాయి. బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం బలహీనమైన గ్లోబల్‌ ట్రెండ్‌, స్థానిక జువెల్లర్స్‌ నుంచి డిమాండ్‌ పడిపోవడమని బులియన్‌ ట్రేడర్లు చెప్పారు. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top