వాహనదారులకు యాక్సిస్‌ ఉచిత ఫాస్టాగ్స్‌

FASTag At Axis Bank - Sakshi

ముంబై: జాతీయ రహదారులపై ప్రయాణించాలంటే డిసెంబర్‌ ఒకటి నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్‌ ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో కొన్ని నెలలపాటు ట్యాగ్స్‌ను ఉచితంగా అందిస్తామని  యాక్సిస్‌ బ్యాంక్‌ బుధవారం ప్రకటించింది. ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించడంలో భాగంగా టోల్‌ప్లాజాలు, పార్కింగ్‌ ప్రాంతాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా, ఫాస్టాగ్‌ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుండగా.. ఈ టెక్నాలజీకి సేవలందించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు బ్యాంక్‌ ప్రకటించింది. దీంతో పాటు ఇందుకోసం ప్రతి ఒక్క ట్యాగ్‌కు రూ. 100 వరకు ఖర్చు పెట్టనున్నట్లు వెల్లడించింది. మరోవైపు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ట్యాగ్స్‌ను ఉచితంగా అందిస్తుండగా, ప్రాసెసింగ్‌ ఛార్జీలను ఎత్తివేసినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈనెల చివరివరకే ఈ సేవలు అందిస్తామని ఇరు బ్యాంకులు ప్రకటించాయి.  

70 లక్షల ఫాస్టాగ్‌ల జారీ
దేశవ్యాప్తంగా 70 లక్షల ఫాస్టాగ్‌లను (బుధవారం నాటికి) జారీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్‌ 26 (మంగళవారం) నాడు అత్యధికంగా 1,35,583 ట్యాగ్‌లు అమ్ముడుకాగా, అంతకుముందు రోజు 1.03 లక్షల విక్రయాలు నమోదైనట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ వెల్లడించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top