మా దగ్గర ఇన్వెస్ట్‌ చేయండి..

Donald Trump Attended Meeting With Indian CEOs - Sakshi

నియంత్రణలను మరింత సడలిస్తాం

భారత కంపెనీలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆహ్వానం

సీఈవోలతో భేటీ

న్యూఢిల్లీ: తమ దేశంలో మరింతగా ఇన్వెస్ట్‌ చేయాలంటూ భారత కంపెనీలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆహ్వానించారు. పెట్టుబడులు పెట్టడాన్ని సులభతరం చేసే దిశగా నియంత్రణలను మరింతగా సడలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. భారత పర్యటనలో భాగంగా మంగళవారం దేశీ దిగ్గజ సంస్థల సీఈవోలతో రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ట్రంప్‌ పాల్గొన్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్, ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా తదితర దిగ్గజాలు దీనికి హాజరయ్యారు. తమ వ్యాపార కార్యకలాపాలు, పెట్టుబడుల గురించి ట్రంప్‌నకు వారు వివరించారు. ‘మీ అందరికీ ధన్యవాదాలు. అపూర్వ విజయాలు సాధించిన మీకు అభినందనలు. మీరు అమెరికా రావాలని, బిలియన్ల కొద్దీ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయాలని కోరుకుంటున్నాను. మేం పెట్టుబడులను నిధులపరంగా కాకుండా ఉద్యోగాల కల్పన దృష్టితో చూస్తాం‘ అని ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికాలో చట్టాలపరంగానూ, ప్రభుత్వపరంగానూ ఉన్న నియంత్రణలపరమైన సమస్యల అంశాన్ని ఈ సందర్భంగా కొందరు వ్యాపారవేత్తలు ప్రస్తావించారు. ‘చాలా నియంత్రణలను ఎత్తివేయబోతున్నాం. పెను మార్పులను మీరు త్వరలోనే చూడబోతున్నారు. ఇకనుంచి పరిస్థితి మరింత మెరుగుపడుతుంది‘ అని ట్రంప్‌ సమాధానమిచ్చారు.(సీఎన్‌ఎన్‌ X ట్రంప్‌)

ఇక్కడ మేము.. అక్కడ మీరు.. 
అమెరికా, భారతీయ కంపెనీలు ఇరు దేశాల్లోనూ ఇన్వెస్ట్‌ చేయాల్సిన అవసరం ఉందని ట్రంప్‌ చెప్పారు. ఉపాధి కల్పనకు ప్రభుత్వాలు తోడ్పాటు మాత్రమే అందించగలవని, ప్రైవేట్‌ రంగమే వాస్తవానికి ఉద్యోగాలు కల్పించగలుగుతుందని ఆయన తెలిపారు. ఈ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, తాను కలిసి పనిచేస్తున్నామని ట్రంప్‌ చెప్పారు. ‘మీ ద్వారా మేము ఈ దేశంలో, ఆయన మా దేశంలో ఉద్యోగాలు కల్పించగలుగుతున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పిన ట్రంప్‌.. మిగతా వివరాలు మాత్రం వెల్లడించలేదు.  సీఈవోల సమావేశంలో మోదీపై ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. ‘మోదీ చాలా మంచి వ్యక్తి అని ఎవరో చెప్పారు. ఆయన నిజంగా మంచి వ్యక్తే. అంతే కాదు చాలా స్థిరంగానూ వ్యవహరిస్తారు. ఆయన గొప్పగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు‘ అని ట్రంప్‌ కితాబిచ్చారు.(నమస్తే ట్రంప్‌ అదిరింది... )

మళ్లీ నేనే..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి తానే గెలుపొందుతానం టూ ట్రంప్‌ ధీమా వ్యక్తం చేశారు. దీంతో మార్కె ట్లు భారీగా లాభపడతాయన్నారు. ఆర్థిక వ్యవస్థ, సైన్యం, వైద్యం తదితర రంగాలకు తమ ప్రభుత్వం ఎంతో తోడ్పాటు అందించిందని ట్రంప్‌ చెప్పా రు. తన సారథ్యంలో అమెరికా ఎకానమీ.. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో   వృద్ధి చెందిందని అన్నారు.

వాణిజ్య ఒప్పందానికి చేరువలో: గోయెల్‌ 
భారత్‌ అమెరికాలు కీలక వాణిజ్య ఒప్పందానికి అతి చేరువలో ఉన్నట్లు మంగళవారం వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ వెల్లడించారు. ఇందుకు సంబంధించి విధివిధానాలు ఖరారవుతున్నట్లు  తెలిపారు. ‘యూఎస్‌–ఇండియా ఫోరమ్‌: పార్ట్‌నర్స్‌ ఫర్‌ గ్రోత్‌’ అన్న అంశంపై ఇక్కడ జరిగిన చర్చలో గోయెల్‌ మాట్లాడారు. పరస్పర భారీ వాణిజ్య ప్రయోజనాలు ఈ ఒప్పందం వల్ల ఒనగూరుతాయని అన్నారు. 2020 నాటికి కేంద్రం లక్ష్యాలను ఆయన ఈ సందర్భంగా వివరిస్తూ, ప్రతి కుటుంబానికీ సొంత ఇల్లు, 24 గంటలూ విద్యుత్, వంట గ్యాస్, ఇంటర్‌నెట్‌  విస్తృతి, నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు వివరించారు.

అమెరికా నుంచి చమురు దిగుమతులు పదింతలు
నిత్యం 2,50,000 బ్యారెళ్ల చమురు దిగుమతి
భారత్‌కు అమెరికా నుంచి చమురు సరఫరాలు రెండేళ్లలో పది రెట్లు పెరిగి.. రోజుకు 2,50,000 బ్యారెళ్ల స్థాయికి చేరాయి. రెండు దేశాల మధ్య ఇంధన బంధం బలోపేతాన్ని ఇది తెలియజేస్తోంది. ఢిల్లీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమక్షంలో జరిగిన వ్యాపార భేటీలో అమెరికా ఇంధన శాఖ మంత్రి డాన్‌ బ్రోలెట్‌ మాట్లాడుతూ.. భారత్‌ 2017లో అమెరికా నుంచి నిత్యం 25,000 బ్యారెళ్లను దిగుమతి చేసుకుంది. గత రెండేళ్లలో ఇది 25,000 బ్యారెళ్ల నుంచి నిత్యం 2,50,000 బ్యారెళ్ల దిగుమతి స్థాయికి చేరుకుంది. ఇది ఇంకా మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నాం’’ అని బ్రోలెట్‌ చెప్పారు. ఇరు దేశాల మధ్య ఇంధన వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతోందంటూ ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ డాన్‌బ్రోలెట్‌ను అభినందించారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల కాలంలో అమెరికా 5.4 మిలియన్‌ టన్నుల చమురును భారత్‌కు ఎగుమతి చేసింది. భారత్‌కు అమెరికా ఆరో అతిపెద్ద చమురు వనరుగా అవతరించినట్టు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఢిల్లీలో జరిగిన భారత్‌–అమెరికా వ్యాపార కార్యక్రమంలో భాగంగా తెలిపారు. అలాగే, అమెరికాకు భారత్‌ ఇప్పుడు 4వ అతిపెద్ద చమురు ఎగుమతి మార్కెట్‌గా మారినట్టు  ఆయన వివరించారు.(రాష్ట్రపతి విందుకు కేసీఆర్‌ హాజరు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top