
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బలహీన ట్రెండ్, దేశీయంగా ధన్‌తేరాస్ రోజైనప్పటికీ.. రిటైలర్లు, జ్యుయలర్ల నుంచి ఒక మోస్తరు కొనుగోళ్ల ధోరణితో మంగళవారం పసిడి ధర రూ.140 మేర తగ్గింది. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలరు బలపడటం కూడా పుత్తడి రేట్లు తగ్గడానికి కారణమైనట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ముంబై బులియన్ మార్కెట్లో మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ. 245 క్షీణించి రూ.29,765 వద్ద, ఆభరణాల బంగారం రూ.29,615 వద్ద క్లోజయ్యింది.
వెండి కిలో ధర రూ. 540 తగ్గి రూ. 39,570 వద్ద ముగిసింది. అటు, న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో మేలిమి బంగారం పది గ్రాముల ధర రూ. 140 తగ్గి రూ. 30,710 వద్ద, ఆభరణాల బంగారం సైతం అంతే క్షీణించి రూ. 30,560 వద్ద ముగిసింది. ఇక వెండి రికార్డు స్థాయిలో రూ.400 క్షీణించి కిలో రేటు రూ. 41,000కు పడింది. అయితే, రోజువారీగా చూస్తే మాత్రం అమ్మకాలు 20% పెరిగాయని, కొనుగోలుదారులు పెట్టుబడి అవసరాల కోసం కొనుక్కోవడమే ఇందుకు కారణమని బులియన్ ట్రేడర్లు తెలిపారు.
పసిడి కొనుగోళ్లకు కేవైసీ నిబంధనల సడలింపుతో రిటైల్ కొనుగోళ్లకు ఊతమిచ్చినప్పటికీ.. అంతర్జాతీయ ట్రెండ్‌లు పసిడి రేట్లపై ప్రభావం చూపినట్లు వివరించారు. అంతర్జాతీయంగా అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్లో డిసెంబర్ కాం ట్రాక్టు ఔన్సు (31.1 గ్రాములు) ధర ఒక దశలో 15 డాలర్లు క్షీణించి 1,287 డాలర్ల వద్ద ట్రేడైంది. దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ ఒక దశలో 0.8% తగ్గుదలతో రూ. 29,611 వద్ద ట్రేడైంది.