‘జీఎస్‌టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులు’ 

Cut Excise Duty, Bring Automobile Fuels Under GST, Chambers Urge Government - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమనడంతో వీటిపై ఎక్సైజ్‌ సుంకాలను తగ్గించాలని, జీఎస్‌టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకురావాలని పరిశ్రమ సంస్థలు ఫిక్కీ, అసోచామ్‌ కేంద్రాన్ని కోరాయి. పెట్రో ధరల రోజువారీ సవరణలో భాగంగా తాజా పెంపుతో పెట్రోల్‌ లీటర్‌ రూ 80 దాటి అత్యంత గరిష్టస్థాయిని నమోదు చేసింది. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో పెట్రో ఉత్పత్తుల ధరలు ఆకాశానికి అంటడం ఆందోళనకరమని ఫిక్కీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, దేశ రాజధాని సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గరిష్టస్ధాయిలకు చేరాయి.

మరోవైపు పెట్రో ఉత్పత్తుల ధరలు రికార్డు స్ధాయికి చేరడంతో చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పందించారు. ఇంధన ధరలు పెరగడం పట్ల ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, దీన్ని నివారించేందుకు పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామని, దీనిపై త్వరలోనే ఓ పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకంలో కోత విధించడం ద్వారా వినియోగదారులకు తాత్కాలికంగా ఊరట లభిస్తుందని, అయితే పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తేవడం ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని అసోచామ్‌ సెక్రటరీ జనవర్‌ డీఎస్‌ రావత్‌ అన్నారు. ఇంధన భద్రతపై భారత్‌ దృష్టి కోణం మారాలని, వీటిని భారీ ఆదాయ వనరుగా ప్రభుత్వాలు పరిగణించరాదని సూచించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top