సెన్సెక్స్‌ డౌన్‌.. నిఫ్టీ అప్‌

సెన్సెక్స్‌ డౌన్‌.. నిఫ్టీ అప్‌ - Sakshi


స్వల్ప శ్రేణిలో హెచ్చుతగ్గులు

ముంబై: శుక్రవారం రోజంతా స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన మార్కెట్లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ కొద్దిపాటి నష్టంతోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ స్వల్పలాభంతోనూ ముగిశాయి. 31,183 పాయింట్ల గరిష్టస్థాయివద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ ఐటీ, ఫార్మా షేర్లలో జరిగిన అమ్మకాల ప్రభావంతో చివరకు 19 పాయింట్ల నష్టంతో 31,056 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్‌ తొలిదశలో 9,600 పాయింట్ల స్థాయిని అధిగమించిన నిఫ్టీ, ఆపైన స్థిరపడలేక 9,588 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితంరోజుతో పోలిస్తే 10 పాయింట్ల పెరుగుదలతో క్లోజయ్యింది. మొత్తంమీద ఈ వారంలో సెన్సెక్స్‌ 205 పాయింట్లు, నిఫ్టీ 80 పాయింట్ల చొప్పున నష్టపోయాయి.ఐదు వారాల తర్వాత సూచీలు నష్టాలతో ముగియడం ఇదే ప్రథమం.  మార్కెట్‌ పెరగడానికి తగిన చోదకాలేవీ లేకపోవడం, విదేశీ ఇన్వెస్టర్లు స్వల్పంగా అమ్మకాలు జరుపుతుండటంతో మార్కెట్‌ కన్సాలిడేషన్‌ మోడ్‌లోకి వెళ్లిపోయిందని విశ్లేషకులు చెప్పారు. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ మరోదఫా వడ్డీ రేట్లను పావుశాతం పెంచిన తర్వాత ప్రపంచ మార్కెట్లు కూడా బలహీనంగానే ట్రేడవుతున్న ప్రభావం ఇండియాపై కూడా పడిందని వారన్నారు. ఇక మార్కెట్లో ఆటోమొబైల్, సిమెంటు, ఎఫ్‌ఎంసీజీ షేర్లు స్వల్పంగా పెరిగాయి. టాటా మోటార్స్, ఐటీసీ, ఏసీసీ, అల్ట్రాటెక్‌ సిమెంటు షేర్లు 1–2 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, విప్రోలు 1 శాతంపైగా క్షీణించాయి.ఫార్మా షేర్లు డౌన్‌...

కొద్దిరోజులుగా కోలుకుంటున్న ఫార్మా షేర్లు తాజాగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఐపీసీఏ ల్యాబ్‌కు చెందిన కొన్ని ప్లాంట్లలో తయారైన ఔషధాల దిగుమతుల్ని అమెరికా నియంత్రణా సంస్థ నిషేధించడంతో ఆ షేరు 8 శాతం పతనమై 4,72 వద్ద ముగిసింది.  లుపిన్‌ 4 శాతం, సన్‌ఫార్మా, సిప్లాలు 2.5 శాతంపైగా నష్టపోయాయి. యుఎస్‌ఎఫ్‌డీఏ ఎప్పటికప్పుడు జారీచేస్తున్న హెచ్చరికలు ఫార్మా రంగంపై ప్రభావం చూపిస్తున్నదని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top