
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎయిరిండియాకు దక్షిణ ముంబైలో ఉన్న 23 అంతస్తుల భవంతిపై పలు ప్రభుత్వ రంగ సంస్థలు కన్నేశాయి. ఈ ప్రాపర్టీని విక్రయించాలా వద్దా అనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ అంతకన్నా ముందే ఎల్‌ఐసీ, జీఐసీ వంటి ప్రభుత్వ రంగ బీమా దిగ్గజాలు దీనిపై ఆసక్తి వ్యక్తం చేసినట్లు ఎయిర్‌లైన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దక్షిణ ముంబైలోని కీలక వ్యాపార కేంద్రం నారిమన్ పాయింట్‌లో ఈ భవంతి ఉంది.
ఇది తమ తమ ప్రధాన కార్యాలయాలకు దగ్గర్లో ఉండటంతో ఎల్‌ఐసీ, జీఐసీ వంటి సంస్థలు దీనిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 2013– 2018 ఆర్థిక సంవత్సరాల మధ్య ఈ ప్రాపర్టీపై లీజు రెంటల్స్ రూపంలో ఎయిరిండియాకు రూ.291 కోట్ల ఆదాయం వచ్చింది. అటు జవహర్‌లాల్ నెహ్రు పోర్ట్ ట్రస్టు (జేఎన్‌పీటీ) కూడా దీనిపై ఆసక్తిగా ఉంది. దాదాపు రూ.55,000 కోట్ల మేర రుణ భారం పేరుకుపోయిన నేపథ్యంలో.. ప్రధాన వ్యాపారేతర ఆస్తులను విక్రయించడం ద్వారా భారాన్ని తగ్గించుకునేందుకు ఎయిరిండియా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.