మనీ ల్యాండరింగ్‌పై ఈడీ కొరడా

 after Demonstration 3,700 cases - Sakshi

డీమోనిటైజేషన్‌ అనంతరం 3,700 కేసులు

రూ.9,935 కోట్ల అక్రమార్జనలపై దృష్టి

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కొందరు పోగేసిన అక్రమార్జనలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు కొరడా ఝుళిపిస్తున్నాయి. మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలకు సంబంధించిన 3,700 కేసుల్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులు రూ.9,935 కోట్ల విలువైన అక్రమార్జనలకు సంబంధించినవని ఈడీ తెలియజేసింది. ఈ కేసుల్లో 43 శాతం పలు డొల్ల కంపెనీల ద్వారా బ్యాంకులను, ఆర్థిక సంస్థలను మోసగించడానికి సంబంధించినవే.

మిగతా వాటిల్లో అవినీతి (31%), డ్రగ్స్‌.. నార్కోటిక్స్‌ వ్యాపారం (6.5%), ఆయుధాలు.. పేలుడు పదార్థాలు (4.5%), ఇతరత్రా కేసులు (8.5 శాతం) ఉన్నట్లు ఈడీ అధికారిక నివేదికలో వెల్లడించింది. మొత్తం 3,758 కేసులు నమోదు చేసిన ఈడీ (3,567 కేసులు ఫారెక్స్‌ చట్టాల కింద, 191 యాంటీ మనీలాండరింగ్‌ చట్టం కింద), 777 షోకాజ్‌ నోటీసులు, అటాచ్‌మెంట్‌ ఆర్డర్లు జారీ చేసింది. గతేడాది నవంబర్‌ 8 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌ దాకా 620 సోదాలు నిర్వహించింది.

ఈ కేసులు రూ. 9,935 కోట్లతో ముడిపడి ఉండగా, ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (పీఎంఎల్‌ఏ) కింద రూ. 5,335 కోట్ల అసెట్స్‌ను ఈడీ జప్తు చేసింది. దర్యాప్తులో భాగంగా 54 మందిని అరెస్టు చేసింది. విదేశీ మారక నిబంధనల ఉల్లంఘన చట్టం కింద రూ. 4,600 కోట్లకు సంబంధించి నోటీసులు జారీ చేసింది.  

రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లు కూడా..
డొల్ల కంపెనీలను ఉపయోగించి అవినీతి సొమ్మును ప్రధానంగా ఆర్థిక సంస్థలు (బ్యాంకులు), రియల్‌ ఎస్టేట్‌ మార్గాల్లో లాండరింగ్‌ చేసినట్లు తెలుస్తోందని ఈడీ నివేదిక పేర్కొంది. అధికారిక వర్గాల ప్రకారం పలువురు రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లపై కూడా దర్యాప్తు సంస్థ దృష్టి పెట్టింది. ‘అవినీతి ద్వారా వచ్చిన సొమ్ము, బ్యాంకులను మోసగించడం ద్వారా వచ్చిన అక్రమార్జన ఈ నల్లధన భూతానికి తలకాయవంటిది.

డీమోనిటైజేషన్‌ అనంతరం కేసులను పరిశీలిస్తే.. వ్యాపార సంస్థలు, ప్రొఫెషనల్స్‌ ఒకరితో మరొకరు ఎలా కుమ్మక్కై డొల్ల కంపెనీలను ఉపయోగించుకుని నల్లధనాన్ని  ఎలా చట్టబద్ధమైన ఆస్తులుగా మార్చుకున్నారో తెలుస్తుంది‘ అని పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top