హైదరాబాద్‌లో ఏబీసీ కో–వర్కింగ్‌ స్పేస్‌ | ABC Co-Working Space in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఏబీసీ కో–వర్కింగ్‌ స్పేస్‌

Jun 8 2018 12:52 AM | Updated on Sep 4 2018 5:48 PM

ABC Co-Working Space in Hyderabad - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోల్‌కతాకు చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ ఏపీజే సురేంద్రకు చెందిన కో–వర్కింగ్‌ స్పేస్‌ బ్రాండ్‌ ఏపీజే బిజినెస్‌ సెంటర్‌ (ఏబీసీ) హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ది పార్క్‌ హోటల్‌లో రెండతస్తుల్లో 475 సీట్లతో కో–వర్కింగ్‌ స్పేస్‌ను అందుబాటులోకి తెచ్చింది. వచ్చే ఏడాది కాలంలో గచ్చిబౌలిలో 35 వేల చదరపు అడుగుల్లో 400 సీట్లను అందుబాటులోకి తెస్తామని ఏపీజే సురేంద్ర అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌), ఏబీసీ డైరెక్టర్‌ శౌవిక్‌ మండల్‌ తెలిపారు. గురువారమిక్కడ ఏబీసీ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం పుణే, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, ముంబై, గుర్గావ్‌ నగరాల్లో 12 బిజినెస్‌ సెంటర్లున్నాయి. వీటి సీటింగ్‌ సామర్థ్యం 1,500. సెప్టెంబర్‌ నాటికి మరో వెయ్యి సీట్లను జత చేస్తాం. ప్రతి బిజినెస్‌ సెంటర్‌ 10 వేల చ.అ.ల్లో, 200 సీట్లతో విస్తరించి ఉంటుంది. 2020 నాటికి రూ.40 కోట్లతో 25 బిజినెస్‌ సెంటర్లలో 5,500 సీట్లను అందుబాటులోకి తేవాలని లకి‡్ష్యంచాం’’ అని మండల్‌ వివరించారు. ఈ ఏడాది రూ.20 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నామని, రెండేళ్లలో రూ.50 కోట్ల టర్నోవర్‌ను టార్గెట్‌ చేశామని చెప్పారు.

నెలకు రూ.8–10 వేలు..
కో–వర్కింగ్‌ స్పేస్‌లో వర్క్‌ క్యాబిన్స్, సమావేశ గదులతో పాటూ వై–ఫై, అడ్మినిస్ట్రేషన్‌ సేవలు, లాకర్, ఐటీ సపోర్ట్,  కమర్షియల్‌ కిచెన్‌ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. వీటి ధరలు నగరాన్ని బట్టి మారుతుంటాయి. హైదరాబాద్‌లో నెలకు ఒక్క సీటుకు రూ.8–10 వేలు, గుర్గావ్‌లో రూ.25–30 వేలు, కోల్‌కతా, చెన్నైల్లో రూ.12–15 వేల వరకూ ఉన్నట్లు మండల్‌ తెలిపారు.

హైదరాబాద్‌లో ఐబీఎం, లెనొవో..
గత మూడేళ్లుగా దేశంలో కో–వర్కింగ్‌ స్పేస్‌కు డిమాండ్‌ పెరుగుతోందని... తమ కస్టమర్లలో 60–70 శాతం కార్పొరేట్‌ కంపెనీలు, 20 శాతం మిడ్‌సైజ్, 10 శాతం స్టార్టప్స్‌ ఉన్నట్లు మండల్‌ తెలిపారు. ‘‘అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్, సిస్కో, టాటా ఏఐజీ, బీఓఐ బీమా విభాగం, అమెజాన్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, మోటరోలా, విస్తారా, అబుదాబి కమర్షియల్‌ బ్యాంక్, ఫ్యూజీ ఎలక్ట్రిక్, ఓఎల్‌ఎక్స్‌ ఇండియా, ఎడిల్‌మెన్, లెనొవో, ఐబీఎం వంటి కార్పొరేట్‌ సంస్థలూ మా కో–వర్కింగ్‌ స్పేస్‌లో కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. లెనొవో, ఐబీఎం సంస్థలు హైదరాబాద్‌లోని కో–వర్కింగ్‌ స్పేస్‌లో కార్యకలాపాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి’’ అని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement