సీఎస్‌బీ బ్యాంక్ ఐపీఓ... అదరహో !

87 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్...
వచ్చే నెల 4న లిస్టింగ్
రూ.75–100 రేంజ్‌లో లిస్టింగ్ లాభాల అంచనాలు!
న్యూఢిల్లీ: సీఎస్‌బీ బ్యాంక్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూ)కు అనూహ్య స్పందన లభించింది. ఈ నెల 22న మొదలై మంగళవారం ముగిసిన ఈ ఐపీఓ 87 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. రూ.193–195 ప్రైస్‌బ్యాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ సైజు రూ.410 కోట్లు. ఈ ఐపీఓలో భాగంగా మొత్తం 2.10 కోట్ల షేర్లను జారీ చేయనున్నారు. మొత్తం వంద కోట్ల షేర్లకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల(క్విబ్)లకు కేటాయించిన వాటా 62 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల(ఎన్‌ఐఐ) వాటా 165 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 44 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. ప్రస్తుతం సీఎస్‌బీ బ్యాంక్ షేర్‌కు గ్రే మార్కెట్ ప్రీమియమ్(జీఎమ్‌పీ) రూ.75–100 రేంజ్‌లో ఉందని, ఈ రేంజ్ లాభాలతోనే(కనీసం) ఈ షేర్ స్టాక్ మార్కెట్లో లిస్టవ్వగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లిస్టింగ్ తేదీ డిసెంబర్ 4.
యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ.184 కోట్లు
ఈ ఐపీఓలో భాగంగా రూ.24 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) విధానంలో 1.97 కోట్ల ఈక్విటీ షేర్లను బ్యాంక్‌లో ఇప్పటికే వాటా ఉన్న కొన్ని కంపెనీలు విక్రయించాయి. కాగా గత గురువారం నాడు సీఎస్‌బీ బ్యాంక్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.184 కోట్లు సమీకరించింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి