‘ఆధార్‌’ ఉల్లంఘిస్తే  రూ.కోటి దాకా జరిమానా 

1 Crore Fine For Failing To Comply With Aadhar Act Norms - Sakshi

న్యూఢిల్లీ: ఆధార్‌ చట్ట నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోనుంది. ఏకంగా రూ.కోటి దాకా పెనాల్టీ విధించడంతో పాటు నిబంధనలు పాటించే దాకా ప్రతి రోజు రూ.10 లక్షల దాకా అదనంగా జరిమానా విధించే ప్రతిపాదనలు రూపొందించింది. విశిష్ట గుర్తింపు సంఖ్యల ప్రాధికార సంస్థకు (యూఐడీఏఐ) మరిన్ని అధికారాలు కల్పించే దిశగా ఆధార్‌ చట్టానికి కేంద్రం ఈ మేరకు సవరణలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం ఆధార్‌ చట్టం ప్రకారం.. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చర్యలు తీసుకునేందుకు యూఐడీఏఐకి అధికారాలు లేవు. ఇక ప్రతిపాదిత సవరణల ప్రకారం.. పిల్లలకు ఆధార్‌ నంబరు జారీ చేసేందుకు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అలాగే, ఆధార్‌ లేనంత మాత్రాన బాలలకు లభించాల్సిన సబ్సిడీ, ఇతరత్రా ప్రయోజనాలను నిలిపివేయరాదు. ఆధార్‌కి సంబంధించి వర్చువల్‌ ఐడీ విధానాన్ని ప్రవేశపెట్టే ప్రతిపాదన కూడా ఉంది. ఆధార్‌ చట్టం కింద యూఐడీఏఐ ఫండ్‌ ఏర్పాటు చేయాలని, దీని ఆదాయాలపై పన్ను మినహాయింపులు ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. ఆధార్‌ చట్ట సవరణల బిల్లు బుధవారం లోక్‌సభ ముందుకు రానుంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top