మన్యంపై వైఎస్‌ఆర్‌సీపీ పట్టు | ysrcp wins five ST Constituencies in andhra pradeh | Sakshi
Sakshi News home page

మన్యంపై వైఎస్‌ఆర్‌సీపీ పట్టు

May 21 2014 8:26 PM | Updated on Aug 14 2018 4:24 PM

మన్యంపై వైఎస్‌ఆర్‌సీపీ పట్టు - Sakshi

మన్యంపై వైఎస్‌ఆర్‌సీపీ పట్టు

సీమాంధ్ర పరిధిలోని మన్యంపై వైఎస్‌ఆర్‌సీపీ పట్టు సాధించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కటి మినహా అన్ని చోట్లా ఆ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.

సీతంపేట: సీమాంధ్ర పరిధిలోని మన్యంపై వైఎస్‌ఆర్‌సీపీ పట్టు సాధించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కటి మినహా అన్ని చోట్లా ఆ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. తెలంగాణ విడిపోయిన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు జిల్లాల పరిధిలో ఏడు ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఆరుచోట్ల వైఎస్సార్‌సీపీకే ఏజెన్సీ వాసులు పట్టం కట్టారు.

పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో మాత్రమే టీడీపీ అభ్యర్థి ముడియం శ్రీనివాస్ ఎన్నికయ్యారు. వైఎస్‌ఆర్‌సీపీ తరఫున  శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుంచి విశ్వాసరాయి కళావతి, విజయనగరం జిల్లా కురుపాం నుంచి పాముల పుష్పశ్రీవాణి, సాలూరు నుంచి పీడిక రాజన్నదొర, విశాఖ జిల్లా పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, అరకు నుంచి కిడారి సర్వేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నుంచి వంతల రాజేశ్వరి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో గిరిజనులకు సంబంధించిన పథకాల అమలు, పర్యవేక్షణలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల పాత్ర కీలకం కానుంది.

కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిబంధనల ప్రకారం గిరిజన సలహా మండలిని ఏర్పాటుచేయాలి. దీనికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చైర్మన్‌గా ఉంటారు. వివిధ శాఖలకు చెందిన నలుగురు ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉంటారు. నాన్ అఫీషియల్ సభ్యులుగా ఎస్టీ ఎమ్మెల్యేలు ఉంటారు. వీరంతా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కార్యచరణ ప్రణాళిక రూపొందించి, దాని అమలును పర్యవేక్షిస్తారు. అలాగే.. నిధుల వ్యయం, ఇతరత్రా అంశాల్లో సలహాలు, సూచనలు ఇస్తారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేలే ఎక్కువగా గిరిజన సలహా మండలిలో సభ్యులుగా ఉండేవారు. ప్రతిపక్షానికి చెందిన ఒకరిద్దరినే నియమించేవారు. అది కూడా ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జరిగేది. ఇప్పుడు పరిస్థితి వేరు.

కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీలో ఒక్కరే ఎస్టీ ఎమ్మెల్యే ఉండటం, మిగిలిన వారంతా ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీకే చెందిన వారు కావడంతో ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా లేకపోయినా వారిని సలహా మండలి సభ్యులుగా నియమించక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతోపాటు శాసనసభ ఎస్టీ కమిటీలోనూ వీరికే ఎక్కువ ప్రాతినిధ్యం లభించనుంది. ఫలితంగా గిరిజన సమస్యలపై స్పందించి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేసే అవకాశం వైఎస్‌ఆర్‌సీపీకి దక్కనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement