breaking news
ST Constituencies
-
భద్రాచలం టు మహబూబాబాద్
2009లో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్, ములుగు అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, భద్రాచలం, పినపాక అసెంబ్లీస్థానాలు దీని పరిధిలో ఉన్నాయి. ఏడింటిలో ఆరు గిరిజన రిజర్వ్డ్ నియోజకవర్గాలే. మొత్తం ఓటర్లు 13,57,806 మంది ఉండగా, పురుషులు 6,74,028 మంది, మహిళలు 6,83,713, మంది, ఇతరులు: 65 మంది ఉన్నారు. సాక్షి, ఇల్లెందు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజన ప్రాంతంగా పేరొందిన భద్రాచలం పార్లమెంట్ నియోజకవర్గం ఉండేది. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భద్రాచలం స్థానంలో మహబూబాబాద్ ఏర్పాటు చేశారు. 1967లో భద్రాచలం ఎస్టీ నియోజకవర్గం ఏర్పడింది. ఆనాడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బీకే రాధాబాయి(1,21,630) తన సమీప సీపీఎంకు చెందిన కేసీ శాంతరాజు(54,395) మీద గెలుపొందారు. 1971లో కాంగ్రెస్ నుంచి బీఆర్ ఆనందరావు(1,15,367)తన సమీప సీపీఐకి చెందిన నూప బొజ్జి (47,319) మీద గెలుపొందారు. 1977లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రాధాబాయి ఆనందరావు(1,55,198), తన సమీప బీఎల్పీ అభ్యర్థి పి. వాణీ రామారావు(59,230) మీద గెలుపొందారు. 1980లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రాధాబాయి ఆనందరావు(147534) తన సమీప సీపీఐ అభ్యర్థి కారం చంద్రయ్య(79,209) మీద గెలుపొందారు. 1984లో సీపీఐ నుంచి పోటీ చేసిన సోడె రామయ్య(1,95,618) తన సమీప అభ్యర్థి బీఆర్ ఆనందరావు(1,70,978) మీద గెలుపొందారు. 1991లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కె. కమల కుమారి(238956) తన సమీప సీపీఐ అభ్యర్థి సోడె రామయ్య(1,94,785) మీద గెలుపొందారు. 1996లో సీపీఐ నుంచి పోటీ చేసిన సోడె రామయ్య(2,45,212) తన సమీప అభ్యర్థి కె.కమల కుమారి(2,17,806)పై గెలుపొందారు. 1998లో సీపీఐ నుంచి పోటీ చేసిన సోడె రామయ్య(2,63,141) తన సమీప అభ్యర్థి కె. కమలకుమారి(2,03,701)పై గెలుపొందారు. 1999లో టీడీపీ నుంచి పోటీ చేసిన దుంప మేరి విజయకుమారి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి టి. రత్నబాయి(2,56,490)పై గెలుపొందారు. 2004లో సీపీఎం నుంచి పోటీ చేసిన మిడియం బాబూరావు(3,73,148) తన సమీప టీడీపీ అభ్యర్థి ఫణీశ్వరమ్మ(3,19,342) మీద గెలుపొందారు. 2009లో మహబూబాబాద్ ఆవిర్భావం.. 2009లో భద్రాచలం రద్దు చేయగా మహబూబాబాద్ ఏర్పాటు చేశారు. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బలరాం నాయక్ (3,94, 447) తన సమీప ప్రత్యర్థి సీపీఐకి చెందిన కుం జా శ్రీనివాసరావు(3,25,490)పై గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అజ్మీర సీతారాం నాయక్(3,20,569) కాంగ్రెస్‌కు చెందిన బలరాం నాయక్(2,85,577)మీద గెలుపొందారు. పూర్వపు మహబూబాబాద్ నియోజకవర్గంలో... మహబూబాబాద్ నియోజకకవర్గం 1951లో జనరల్‌గా ఉండేది. ఇక్కడి నుంచి తొలి దఫా రామస్వామి ఎంపీగా గెలుపొందారు. 1951లో కాంగ్రెస్ నుంచి జనార్దన్‌రెడ్డి(1,73,926) తన సమీప ఎస్పీ అభ్యర్థి ఎం. రామిరెడ్డి(1,02,131)పై గెలుపొందారు. 1957లో కాంగ్రెస్ నుంచి మధుసూదన్‌రెడ్డి (1,03,964)తన సమీప పీడీఎఫ్ అభ్యర్థి సర్వభట్ల రామనాథం(96,708)మీదగెలుపొందారు. 1962లో కాంగ్రెస్ నుంచి మధుసూదన్‌రావు (1,26,100) తన సమీప సీపీఐకి చెందిన తీగల సత్యనారాయణరావు(1,12,524) మీద గెలుపొందారు. 1965లో (బైఎలక్షన్) కాంగ్రెస్ నుంచి రామసహాయం సురేందర్‌రెడ్డి(1,61,156), తన సమీప సీపీఎం అభ్యర్థి మద్దికాయల ఓంకార్(43,819) మీద గెలుపొందారు. ఈ ఎన్నికల తర్వాత వచ్చిన పునర్విభజనతో మహబూబాబాద్ నియోజకవర్గం రద్దయింది. తిరిగి 2009లో.. తిరిగి 2009లో మహబూబాబాబాద్ ఎస్టీ నియోజకవర్గం ఆవిర్భవించగా తొలి దఫా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోరిక బలరాం నాయక్(3,94,447) తన సమీప సీపీఐకి చెందిన కుంజా శ్రీనివాసరావు మీద (3,25,490)గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్ నుంచి అజ్మీర సీతారాం నాయక్(3,20,569)తన సమీప కాంగ్రెస్‌కు చెందిన బలరాం నాయక్(2,85,577) మీద గెలుపొందారు. -
మన్యంపై వైఎస్ఆర్సీపీ పట్టు
సీతంపేట: సీమాంధ్ర పరిధిలోని మన్యంపై వైఎస్ఆర్సీపీ పట్టు సాధించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కటి మినహా అన్ని చోట్లా ఆ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. తెలంగాణ విడిపోయిన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు జిల్లాల పరిధిలో ఏడు ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఆరుచోట్ల వైఎస్సార్సీపీకే ఏజెన్సీ వాసులు పట్టం కట్టారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో మాత్రమే టీడీపీ అభ్యర్థి ముడియం శ్రీనివాస్ ఎన్నికయ్యారు. వైఎస్ఆర్సీపీ తరఫున శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుంచి విశ్వాసరాయి కళావతి, విజయనగరం జిల్లా కురుపాం నుంచి పాముల పుష్పశ్రీవాణి, సాలూరు నుంచి పీడిక రాజన్నదొర, విశాఖ జిల్లా పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, అరకు నుంచి కిడారి సర్వేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నుంచి వంతల రాజేశ్వరి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో గిరిజనులకు సంబంధించిన పథకాల అమలు, పర్యవేక్షణలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల పాత్ర కీలకం కానుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిబంధనల ప్రకారం గిరిజన సలహా మండలిని ఏర్పాటుచేయాలి. దీనికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చైర్మన్‌గా ఉంటారు. వివిధ శాఖలకు చెందిన నలుగురు ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉంటారు. నాన్ అఫీషియల్ సభ్యులుగా ఎస్టీ ఎమ్మెల్యేలు ఉంటారు. వీరంతా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కార్యచరణ ప్రణాళిక రూపొందించి, దాని అమలును పర్యవేక్షిస్తారు. అలాగే.. నిధుల వ్యయం, ఇతరత్రా అంశాల్లో సలహాలు, సూచనలు ఇస్తారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేలే ఎక్కువగా గిరిజన సలహా మండలిలో సభ్యులుగా ఉండేవారు. ప్రతిపక్షానికి చెందిన ఒకరిద్దరినే నియమించేవారు. అది కూడా ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జరిగేది. ఇప్పుడు పరిస్థితి వేరు. కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీలో ఒక్కరే ఎస్టీ ఎమ్మెల్యే ఉండటం, మిగిలిన వారంతా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకే చెందిన వారు కావడంతో ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా లేకపోయినా వారిని సలహా మండలి సభ్యులుగా నియమించక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతోపాటు శాసనసభ ఎస్టీ కమిటీలోనూ వీరికే ఎక్కువ ప్రాతినిధ్యం లభించనుంది. ఫలితంగా గిరిజన సమస్యలపై స్పందించి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేసే అవకాశం వైఎస్ఆర్సీపీకి దక్కనుంది.