చంద్రబాబు పాలనలో ఎనీటైమ్‌ మద్యం: రోజా | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనలో ఎనీటైమ్‌ మద్యం: రోజా

Published Wed, Jul 24 2019 6:57 PM

YSRCP MLA RK Roja Fires On Chandrababu Naidu In Assembly - Sakshi

సాక్షి, అమరావతి: మహిళల జీవితాలను మద్యం చిన్నాభిన్నం చేసిందని, గత ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీతో వారికి కనీస రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యాన్ని దశల వారిగా నిర్మూలిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం గొప్ప పరిణామం అన్నారు. ఆడపిల్ల కన్నీళ్లు పెడితే రాష్ట్రానికి మంచిది కాదని, గడిచిన ఐదేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గురిచేసిన చిత్రహింసలకు మహిళలంతా ఛీకొట్టారని గుర్తుచేశారు. బెల్టుషాపులను పూర్తిగా నిర్మూలిస్తానని చెప్పిన చంద్రబాబు.. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిందని, ఎనీటైమ్‌ మద్యం దొరికేదని విమర్శించారు.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం చర్చలో రోజా పాల్గొని ప్రసంగించారు. వైఎస్‌ జగన్‌ మాటిస్తే మడమ తిప్పరని, మహిళా పక్షపాతి అని కొనియాడారు. గతంలో ఉన్నది నారావారి పాలన కాదని.. సారావారి పాలన అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రంలో 40వేలకు పైగా బెల్టు షాపులు ఉన్నాయని రోజా వెల్లడించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో మహిళలపై నేరాలు విపరీతంగా పెరిగాయని, ఆయన అసమర్థ పాలన కారణంగానే రిషితేశ్వరి చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు వేధించిన చంద్రబాబుకు గత ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని రోజా అభిప్రాయపడ్డారు.  

టార్గెట్‌ పెట్టి మరీ మద్యం అ‍మ్మకాలు..
మద్యం కారణంగా ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నాయని  వైఎస్సార్‌సీపీ సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ అర్జనగా భావించిందని విమర్శించారు. టార్గెట్‌ పెట్టి మరీ మద్యం అ‍మ్మకాలను జరిపారని, అనంతపురం జిల్లాలో తాగటానికి నీళ్లు ఉండవు కానీ, మద్యం మాత్రం ఉంటుందని గత ప్రభుత్వంపై మండిపడ్డారు. మద్యం షాపులు విపరీతంగా పెరిగి.. పాఠశాలలు మూతపడ్డాయని అన్నారు.

Advertisement
Advertisement