‘చంద్రబాబు గురించి ఎన్టీఆర్‌ చెప్పింది అక్షర సత్యం’

YSRCP Leaders Pays Tribute To Mahatma Phule On His Death Anniversary - Sakshi

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యాలయంలో మహాత్మా ఫూలేకు నివాళులు

సాక్షి, విజయవాడ : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే 128వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఫూలే, అంబేద్కర్‌ చిత్రపటాలకు పూలమాలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌తో పాటు ఎమ్మెల్యే రక్షణనిధి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌, యలమంచిలి రవి, డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌, బొప్పన భవకుమార్‌, తోట శ్రీనివాస్‌, ఎంవీఆర్‌ చౌదరి, నందిగామ సురేష్‌, అంజిరెడ్డి తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జోగి రమేష్‌ మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే సిద్ధాంతాలను అమలు చేసే ఏకైక పార్టీ వైఎస్సార్‌ సీపీ అని పేర్కొన్నారు. ఫూలే సిద్ధాంతాలు, లక్ష్యాలకి పునరంకితమవ్వాలని పిలుపునిచ్చారు. టీడీపీ- కాంగ్రెస్‌ పార్టీ పొత్తు గురించి ప్రస్తావిస్తూ... ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ పార్టీ పెడితే.. చంద్రబాబు మాత్రం సోనియా, రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకునే స్థాయికి దిగజారారని విమర్శించారు. నాలుగేళ్లు మోదీ చంకనెక్కి, బీజేపీతో అంటకాగిన చంద్రబాబు పచ్చి అవకాశవాది అని మండిపడ్డారు. చంద్రబాబు చేస్తోంది రాజకీయ వ్యభిచారమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు గురించి ఎన్టీఆర్‌ అప్పట్లో చెప్పింది అక్షరాలా నిజమవుతోందన్నారు. నందమూరి కుటుంబం కూడా ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని మోదీని ఎదిరించి కేంద్రంతో పోరాడుతుంది తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మాత్రమేనని తెలిపారు.

ఇద్దరూ కలిసి వైఎస్‌ జగన్‌పై కేసు పెట్టారు: మల్లాది విష్ణు
రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి కుట్రతో వైఎస్‌ జగన్‌పై అక్రమ కేసులు పెట్టారని వైఎస్సార్‌ సీపీ నాయకులు మల్లాది విష్ణు అన్నారు. మళ్లీ ఇప్పుడు ఇద్దరూ కలిసి సిగ్గులేకుండా ఎన్నికలకు కూడా వెళ్తున్నారని విమర్శించారు. అయినా బ్యాంకులు దోచిన టీడీపీ నేతలతో కలిసి రాహుల్ ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ డిక్షనరీలో భయం అనే పదం లేదని, ప్రజల సంక్షేమం కోసమే వైఎస్సార్‌సీపీ పాటుపడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు వైఎస్‌ జగన్‌పై అవాకులు, చెవాకులు పేలడం మానుకోవాలని హితవు పలికారు.

కత్తెరలు, ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి సరిపెడతారా?
ఫూలే సిద్ధాంతాలను రాష్ట్రంలో అమలుచేసిన ఘనత వైఎస్సార్‌కే చెందుతుందని ఎమ్మెల్యే రక్షణనిధి అన్నారు. దేశమంతా ఫూలే వర్ధంతిని ఘనంగా జరుపుకుంటోందని, బడుగు, బలహీన వర్గాలకు ఆయన ఆదర్శనీయని కొనియాడారు. బీసీలను బలోపేతం చేస్తానన్న చంద్రబాబు కేవలం కత్తెరలు, ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి సరిపెడతారా అని ప్రశ్నించారు. బీసీలకు ఎల్లప్పుడూ వైఎస్సార్‌ సీసీ అండగా ఉంటుందని తెలిపారు.  

అప్పటికి జగన్‌ సీఎం అవుతారు: వెల్లంపల్లి శ్రీనివాస్
పూలే 129 వ వర్దంతి నాటికి జగన్ సీఎం స్థానంలో ఉంటారని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే ఆశయ సాధనకు అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top