వాళ్లకు ఇంకా బుద్ధి రాలేదు: శ్రీనివాస్‌

Vellampalli Srinivas Slams TDP Over Negative Campaign About Govt - Sakshi

సాక్షి, విజయవాడ : దసరా ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఎటువంటి లోపాలు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. గురువారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఇంతకు ముందున్న ప్రభుత్వానికి దేవుళ్లంటే భయం.. భక్తీ లేదు.. పుష్కరాల పేరుతో ఆలయాలు కూల్చేసిన ఘనత వారిదని విమర్శించారు. అటువంటి వ్యక్తులు ఇప్పుడు భక్తుల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గత పాలకులు సక్రమంగా పనిచేసి ఉంటే ఇప్పుడు భక్తులు ఇంత దూరం నడవాల్సి వచ్చేది కాదన్నారు. ఇక ఆలయానికి వచ్చిన మాజీ మంత్రులు అమ్మవారిని దర్శించుకోకుండా.. ఇష్టారీతిన ప్రభుత్వాన్ని నిందించడం తగదని హితవు పలికారు. ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పినా వారికి బుద్ది రాలేదని.. ఎవరైనా భక్తి భావంతో అమ్మవారి సన్నిధికి రావాలి గానీ ఇలా రాజకీయాలు చేయడానికి కాదని పేర్కొన్నారు.

దేవినేని ఉమా బుద్ధి మారదా?
అమ్మవారి సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిందంటూ టీడీపీ నేత దేవినేని ఉమా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం మాదిరిగా తమ ప్రభుత్వంలో చీర దొంగలు, క్షుద్ర పూజలు చేసేవాళ్లు లేరని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమలాగే అందరూ ఉంటారని భావించే దేవినేని ఉమా బుద్ధి ఇక మారదా అని విష్ణు ప్రశ్నించారు.

మోకాళ్ల మీద నడిచినా పాపాలు పోవు..
ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేయడానికి టీడీపీ నేతలు కుట్ర చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ ఆరోపించారు. అమ్మవారి కరుణా కటాక్షాలు లేకపోవడం వల్లనే మీరు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నారని టీడీపీ నేతలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘అమ్మవారి దీవెనలు మాకు పుష్కలంగా ఉన్నాయి. అందుకే మేము అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేశాము. మీరు మోకాళ్ల మీద నడిచి వచ్చినా మీ పాపాలు పోవు’ అని విమర్శించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top