నమ్మించి మోసం చేశారు

Ysrcp leaders fires on Chandrababu naidu - Sakshi

చంద్రబాబు పాలనలో బీసీలు దగాపడ్డారు 

హామీలు నమ్మి ఓట్లేస్తే.. అభివృద్ధి, సంక్షేమం శూన్యం

బీసీ డిక్లరేషన్, మ్యానిఫెస్టోలకు దిక్కులేకుండా పోయింది

నాటి వైఎస్సార్‌ పాలనలోనే బీసీలకు మేలు జరిగింది

మళ్లీ మార్పునకు శ్రీకారం చుట్టేందుకే వైఎస్సార్‌ సీపీ బీసీ అధ్యయన వేదిక

త్వరలోనే జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా బీసీ డిక్లరేషన్‌ విడుదల

మ్యానిఫెస్టోలో పొందుపరచడంతో పాటు ప్రతి అంశాన్నీ అమలుచేస్తాం

 వైఎస్సార్‌ సీపీ బీసీ అధ్యయన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి

ఒంగోలు: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో బీసీలు అడుగడుగునా దగా పడ్డారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అందుకే బీసీల సంపూర్ణ అభివృద్ధిని కాంక్షిస్తూ వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు చేపట్టారు. బీసీలలో ఉన్న అన్ని కులాల స్థితిగతులను అధ్యయనం చేసి ఆ కులాలన్నింటినీ ఐక్యం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే బీసీ అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు’ అని వైఎస్సార్‌ సీపీ బీసీ అధ్యయన కమిటీ రాష్ట్ర అధ్యక్షులు, పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి వివరించారు. స్థానిక ఏ1 ఫంక్షన్‌హాలులో బుధవారం నిర్వహించిన వైఎస్సార్‌ సీపీ బీసీ అధ్యయన వేదిక సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. కేవలం చంద్రబాబు ఇచ్చిన హామీలను చూసి ఓట్లేసి బీసీలు దగాపడ్డారని పేర్కొన్నారు. 2012లోనే బీసీ డిక్లరేషన్‌లో 126 హామీలను పొందుపరిచి 2014 ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు.. వాటిని ఏమాత్రం అమలు చేయకపోవడంతో బీసీలంతా అభివృద్ధి, సంక్షేమానికి పూర్తిగా దూరమయ్యారని తెలిపారు. 

ఈ స్థితిలో బీసీల జీవితాల్లో వెలుగులు నింపాలంటే ముందుగా వారి స్థితిగతులను అధ్యయనం చేయడమే మంచిదనే ఉద్దేశంతో బీసీల అధ్యయనానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. తాము ఒక పార్టీ తరఫున అధ్యయనం చేస్తున్నప్పటికీ పార్టీలకు అతీతంగా కదలివచ్చి అభిప్రాయాలు చెబుతున్న వారందరికీ కృష్ణమూర్తి కృతజ్ఞతలు ప్రకటించారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా కాంగ్రెస్‌ భావిస్తున్న దశలో ఎన్‌టీఆర్‌ ముందుకు వచ్చి బీసీలకు అండగా నిలిచారని, ఆయన ముఖ్యమంత్రి కాగానే బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషిచేశారని పేర్కొన్నారు. అదే నమ్మకంతో 2014లో చంద్రబాబుకు ఓట్లేసిన బీసీలు నేడు భగ్గుమంటున్నారని తెలిపారు. 

100 సీట్లు, ఏటా పదివేల కోట్లు అన్న చంద్రబాబు.. నాలుగున్నర సంవత్సరాల పాలనలో కేవలం 14 నుంచి 15 వేల కోట్లు కూడా బీసీలకు కేటాయించలేదని, తద్వారా బడ్జెట్లో రూ.30 వేల కోట్ల మేర బీసీలకు అన్యాయం జరిగిందని జంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బీసీల జీవితాల్లో వెలుగులు నింపాలని, చంద్రబాబులాగా ఆచరణ సాధ్యంకాని హామీలు కాకుండా కచ్చితంగా అమలు చేసే హామీలివ్వాలనే ఉద్దేశంతో జగన్‌ ముందుకు సాగుతున్నారన్నారు. ఆ హామీలను బీసీ డిక్లరేషన్‌లో పొందుపరచాలని నిర్ణయించారని జంగా పేర్కొన్నారు. దానిలో భాగంగా బీసీ అధ్యయన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.

బీసీలకు ఏం చేశారో చెప్పండి : టీడీపీని నిలదీసిన బాలినేని
బీసీల కోసం నాలుగున్నరేళ్లుగా ఏం చేశారో చెప్పాలని వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీని నిలదీశారు. ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదవాలని వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెడితే, దానికి కూడా చంద్రబాబు తూట్లు పొడిచాడని మండిపడ్డారు. తాను 15 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉండి ఏనాడూ రుణాల దరఖాస్తులపై సంతకాలు చేయలేదని, అర్హులకు యథావిధిగా రుణాలు ఇచ్చేవారని తెలిపారు. కానీ, ప్రస్తుత ఒంగోలు ఎమ్మెల్యే సంతకాలు చేస్తేనే అర్హత ఉన్నా..లేకున్నా రుణం వస్తుందన్నారు. దీనివల్ల అర్హులకు కాకుండా టీడీపీ వర్గీయులకే రుణాలు అందుతున్నాయన్నారు. స్థానిక ఒగ్గులకుంటలో 3 ఎకరాల స్థలాన్ని తన హయాంలో రజకులకు కేటాయిస్తే.. దానిని రద్దు చేయాలని ప్రస్తుతం టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, దీనిపై అవసరమైతే కోర్టుకువెళ్లయినా రజకులకు అండగా ఉంటామని బాలినేని స్పష్టం చేశారు. 

బీసీలు పారిశ్రామికంగా ఎదగాలి : ఒంగోలు మాజీ ఎంపీ వైవీ
బీసీల సంక్షేమం కోసం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా బీసీలకు అవకాశం కల్పించాలనే డిమాండ్‌కు తాను సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నానన్నారు. రజకులను ఎస్సీలలో చేర్చాలని రెండేళ్ల క్రితం పార్లమెంట్‌లో కూడా మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

బీసీలపై చంద్రబాబు తీరు దుర్మార్గం : సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు
న్యాయం కోసం కోర్టుకెళ్లిన నాయీ బ్రాహ్మణుల పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు దుర్మార్గమని, దీన్ని ప్రతి బీసీ నేత గుర్తుంచుకోవాలని సంతనూతలపాడు ఎమ్మెల్యే డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. బీసీ మహిళా కార్పొరేషన్, బీసీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఆర్థిక వనరులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలి : మార్కాపురం ఎమ్మెల్యే జంకె
బీసీలకు జరిగిన అన్యాయాలను గమనించి చేయిచేయి కలిపి చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. బీసీల సంక్షేమానికి శ్రీకారం చుట్టిన జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలిచేందుకు ముందుకు రావాలన్నారు. వైఎస్సార్‌ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్‌ మాట్లాడుతూ బీసీలంతా ఐకమత్యంగా ఉంటే శాసనసభలో, శాసనమండలిలో తప్పక ప్రాధాన్యత ఉంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

 సీటు ఎవరికి ఇచ్చినా గెలిపించుకునేందుకు ఐక్యం కావాలన్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి బీసీలంటే ఎంతో మక్కువని పేర్కొంటూ పలు ఉదాహరణలు వివరించారు. మాజీ ఎంపీ చిమటా సాంబు మాట్లాడుతూ పార్టీల విషయానికొస్తే జిల్లాలో బీసీలకు ఎక్కువ అవకాశాలు కల్పించింది వైఎస్సార్‌ సీపీనే అని పేర్కొన్నారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిని సైతం బీసీలకే కట్టబెట్టేందుకు సిద్ధపడిన ఘనత వైఎస్సార్‌ సీపీకి ఉందన్నారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా ఉండి ఆనాడు ఎన్‌టీఆర్‌ పట్ల చూపించిన విశ్వాసాన్ని రాబోయే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల కనబరచాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షులు కటారి శంకర్‌ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో పేరుకు ఫెడరేషన్‌లు ఏర్పాటు చేసినా రుణాలు మాత్రం పొందలేని పరిస్థితి నెలకొందన్నారు.

 సవాలక్ష ఆంక్షలతో, అడుగడుగునా అధికార పార్టీ కార్యకర్తలు అడ్డం తగులుతూ ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ కాలేజీ, హాస్టళ్లను వైఎస్సార్‌ ఏర్పాటు చేస్తే.. వాటిలో కనీసం విద్యార్థులు ఉండి చదువుకోలేని పరిస్థితులను టీడీపీ సృష్టించడం దారుణమన్నారు. సదస్సులో వైఎస్సార్‌ సీపీ బీసీ అధ్యయన కమిటీ సభ్యులు అవ్వారు ముసలయ్య, తొండమల్ల పుల్లయ్య, వినుకొండ సుబ్బారావు, పలు సామాజిక వర్గాల నాయకులు పాల్గొని తమ డిమాండ్లను కమిటీ ముందు ఉంచారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top