ప్రతి ఎకరా వరికి నీరివ్వాల్సిందే 

YSRCP Leader Balineni Srinivasa Reddy Protest In Prakasam - Sakshi

దర్శి : నాగార్జున సాగర్‌ కుడి కాలువ కింద ప్రతి ఎకరాకు నీరు అందివ్వాల్సిందేనని, లేని పక్షంతో తమ పోరాటం ఉధృతం చేస్తామని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం దర్శి నియోజకవర్గంలో సాగర్‌ నీరు అందక సాగుకు నోచుకోని పొలాలను బాలినేని స్థానిక నేతలతో  కలిసి పరిశీలించారు. అనంతరం దర్శి పట్టణంలో గడియారం స్తంభం సెంటర్‌లో రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. తొలుత రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వరికి నీరిస్తామని చెప్తేనే జిల్లాలో రైతులు నార్లు పోసుకున్నారన్నారు.

ఒక్కో రైతు ఎకరాకు రూ.10 వేలు ఖర్చుపెట్టి నార్లు పోసుకుంటే ఇప్పుడు నీరివ్వలేమని చెప్పడం సిగ్గుచేటన్నారు.   నాగార్జున సాగర్‌లో 579.80 అడుగుల మేర నీరున్నా అధికారులు వారబందీలు పెట్టి జిల్లాకు 10 రోజులకు ఒక సారి నీరిస్తామని చెప్పడం దారుణమన్నారు. ఇప్పటి వరకు వరినార్లు పోసుకున్న వారే నాట్లు వేసుకోవాలని, అది కూడా ఈనెల 27వ తేదీ నాటికే నాట్లు పూర్తి చేయాలని అధికారులు ఆంక్షలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. సాగర్‌ ఆయకట్టు రైతులకు నీరిచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. జిల్లా రైతాంగం అంటే చంద్రబాబుకు ఆది నుంచి వివక్షే అని బాలినేని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి  వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో సాగర్‌లో 545 అడుగుల నీరు ఉన్నప్పుడే వరితో పాటు ఆరుతడి పంటలకు నీరిచ్చారని బాలినేని గుర్తు చేశారు.

జిల్లాకు రావాల్సిన నీటి ఎక్కువ భాగం గుంటూరు జిల్లా రైతులు అక్రమంగా  తరలించుకుపోతుంటే ఇక్కడ అధికారంలో ఉన్న మంత్రి, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. జిల్లాకు రావాల్సిన నీటి వాటా తీసుకురావడం చేతకాక దద్దమ్మల్లా మంత్రి, ఎమ్మెల్యేలు ఇళ్లలో కూర్చున్నారని ఆయన విమర్శించారు.  రైతుల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్ష పార్టీని ధర్నాలు చేయడమేంటని అధికార పార్టీ నేతలు పేర్కొనడం  దారుణమన్నారు.  ఓట్లేసి  గెలిపించిన రైతుల కోసం కాలువల పై తిరిగి వారి సమస్యలు తెలుసుకోవడం చేతకాని మీరా వైఎస్సార్‌ సీపీని విమర్శించేదని బాలినేని మంత్రిని నిలదీశారు. ఒక్క సారి పొలాలకు వెళ్లి పరిశీలిస్తే రైతుల బాధలు అర్థమవుతాయన్నారు.  

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాగునీటి కోసం చీమకుర్తిలో ధర్నా చేస్తుండగా అప్పటి మంత్రి దామచర్ల ఆంజనేయులు ముఖ్యమంత్రితో మాట్లాడి నీరిస్తామని హామీ ఇచ్చి తమ ధర్నాను విరమింపజేశారన్నారు. ఆ తరువాత ఆయనకు రెండు రోజుల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని బాలినేని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు రైతులపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు.  ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన శిద్దా రాఘవరావు నీరు తెప్పించడం చేతకాక ప్రతిపక్షంపై విమర్శలు చేయడం   సబబుకాదన్నారు. నీరు తెప్పించడం చేతకాకపోతే మంత్రి పదవికి శిద్దా రాజీనామా చేయాలని బాలినేని డిమాండ్‌ చేశారు. మార్చి ఆఖరు వరకు నీరందించకపోతే మీ సంగతి తేలుస్తామని హెచ్చరించారు. ప్రతి ఎకరాను పరిశీలించి రైతులకు నీరందించే వరకు ప్రభుత్వాన్ని నిద్ర పోనివ్వమన్నారు.

ఎక్కడ ఎకరా ఎండినా మళ్లీ ధర్నాలు చేసి స్తంభింపచేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర ట్రేడ్‌ యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ జీ నాగరాజు, స్టేట్‌ మహిళా ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి రమణమ్మ, జిల్లా ట్రేడ్‌ యూనియన్‌ ప్రసిడెంట్‌ కేవీ ప్రసాద్, జిల్లా యూత్‌ ప్రసిడెంట్‌ గంటా రామానాయుడు, యూత్‌ జనరల్‌ సెక్రటరీ బీమిరెడ్డి నాగమల్లేశ్వర్‌రెడ్డి,  దర్శి, దొనకొండ, ముండ్లమూరు, తాళ్లూరు మండల కన్వీనర్లు వెన్నపూస వెంకటరెడ్డి, కాకర్ల కృష్ణారెడ్డి, సూదిదేవర అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు కుమ్మిత అంజిరెడ్డి, రొండా అంజిరెడ్డి, యడమకంటి వేణుగోపాల్‌రెడ్డి,  తాళ్లూరు ఎంపీపీ, జెడ్పీటీసీలు గోళ్లపాటి మోషె, మారం వెంకారెడ్డి, మాజీ సాగర్‌ ప్రాజెక్ట్‌ వైస్‌ చైర్మన్‌ సద్ది పుల్లారెడ్డి, మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ కేవీరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గోను నారాయణరెడ్డి, రైతు విభాగం మండల అధ్యక్షుడు ఉడుముల వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్‌లు పాణెం కృష్ణారెడ్డి, చంద్రగిరి గురవారెడ్డి నాయకులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top