చుక్క నీరు కూడా వృథా కాకూడదు | YS Jaganmohan Reddy Comments In Israeli company IDE Technologies Representatives Meeting | Sakshi
Sakshi News home page

చుక్క నీరు కూడా వృథా కాకూడదు

Feb 27 2020 3:51 AM | Updated on Feb 27 2020 10:22 AM

YS Jaganmohan Reddy Comments In Israeli company IDE Technologies Representatives Meeting - Sakshi

ఐడీఈ టెక్నాలజీస్‌ డిప్యూటీ సీఈవో టోరెన్‌స్టైన్‌కు జ్ఞాపికను అందిస్తున్న సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒక్క చుక్క నీటిని కూడా వృథా చేయకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. నీటి కొరతను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సముద్రపు నీటి డీశాలినేషన్‌ (సముద్రపు నీటిని శుద్ధి చేసి వినియోగించడం)పై దృష్టి సారించాలన్నారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఇజ్రాయెల్‌ కంపెనీ ఐడీఈ టెక్నాలజీస్‌ డిప్యూటీ సీఈవో లీహి టోరెన్‌స్టైన్, ఇతర ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. మంచి నీటిని వృథా చేయకుండా డీశాలినేషన్‌ నీటిపై దృష్టి పెట్టామన్నారు. ఇజ్రాయెల్‌  మొత్తం డీ శాలినేషన్‌ నీటినే వినియోగిస్తోందని, పారిశ్రామిక అవసరాలకు ఆ నీటినే వినియోగించాలని చెప్పారు. అవసరమైన పక్షంలో తాగునీటి అవసరాల కోసం కూడా డీశాలినేషన్‌ నీటినే వినియోగించే పరిస్థితి రావాలని సూచించారు. ఆ మేరకు ఆ ప్లాంట్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకునేట్టు ఉండాలని పేర్కొన్నారు. ఎక్కడెక్కడ డీశాలినేషన్‌ ప్లాంట్లు పెట్టాలి అన్న దానిపై అధ్యయనం చేసి, ఆ మేరకు నివేదికలు ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. మొదట విశాఖపట్నంతో ప్రారంభించి.. దశల వారీగా విస్తరించుకుంటూ వెళ్లాలని సూచించారు. 

నిర్వహణ, ఖర్చు వివరాలతో నివేదిక 
విశాఖపట్నం, తడ, కృష్ణపట్నం తదితర ప్రాంతాల్లో డీశాలినేషన్‌ నీటిని వినియోగించేలా చూడాలని సీఎం సూచించారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌కు డీశాలినేషన్‌ లేదా శుద్ధి చేసిన నీటిని వాడేలా చూడాలని,  రాష్ట్రంలోని థర్మల్‌ ప్లాంట్లు కూడా ఆ నీటినే వినియోగించేలా ప్రణాళిక తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మురుగు నీటి శుద్ధికి అవుతున్న ఖర్చు, టెక్నాలజీపై కూడా దృష్టి పెట్టాలని, డీశాలినేషన్‌ ప్లాంట్ల సాంకేతికత, నిర్వహణ ఖర్చులపై సమగ్ర వివరాలు సమర్పించాలన్నారు.   విశాఖపట్నం సహా ఆయా ప్రాంతాలను పరిశీలించి ఆ మేరకు నివేదికలు రూపొందించాలని, పరిశ్ర మలకు ఏ ప్రమాణాలతో నీరు కావాలో నిర్ణయించి ఆ మేరకు అన్ని అంశాలతో నివేదిక ఇవ్వాలని సూచించారు.  

 40 దేశాల్లో ఐడీఈ కార్యకలాపాలు
ఇండియా అనేక రకాలుగా నీటి కొరతను ఎదుర్కొంటోందని, నీటి భద్రత అనేది చాలా ముఖ్యమని ఐడీఈ కంపెనీ ప్రతినిధులు వివరించారు. ఏపీలో నీటి కొరత తీర్చడానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు హర్షణీయమన్నారు. ఇజ్రాయెల్, భారత్‌ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. 1964లో తొలిసారిగా కమర్షియల్‌ డీశాలినేషన్‌ ప్లాంట్‌ను ఇజ్రాయెల్‌లో పెట్టామని వారు వివరించారు. ఐడీఈ టెక్నాలజీస్‌ ప్రపంచ వ్యాప్తంగా 4 దశాబ్దాలుగా 40 దేశాల్లో 400కు పైగా ప్లాంట్లను నిర్వహిస్తోందన్నారు. చైనా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోనూ తమ కంపెనీ కార్యకలాపాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.

భారత్‌లో 25 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డీశాలినేషన్‌ ప్లాంట్ల వల్ల త్వరితగతిన పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాలు, ఆదాయం వస్తుందని వారు వివరించారు. సముద్రపు నీటిని డీశాలినేషన్‌ చేయడంతో పాటు కలుషిత నీటిని కూడా శుద్ధి చేయడంలో అత్యుత్తమ సాంకేతిక విధానాలను అవలంభిస్తున్నామన్నారు. ఎస్సార్, రిలయన్స్‌ కంపెనీల్లో ఇండస్ట్రియల్‌ మురుగు నీటి శుద్ధి కేంద్రాలను నిర్వహిస్తున్నామని, శుద్ధి చేసిన మురుగు నీటిని పరిశ్రమలు వినియోగించుకుంటున్నాయని వారు వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement