breaking news
Water shortage prevention
-
నీటి కొరతను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు
-
చుక్క నీరు కూడా వృథా కాకూడదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒక్క చుక్క నీటిని కూడా వృథా చేయకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. నీటి కొరతను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సముద్రపు నీటి డీశాలినేషన్ (సముద్రపు నీటిని శుద్ధి చేసి వినియోగించడం)పై దృష్టి సారించాలన్నారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఇజ్రాయెల్ కంపెనీ ఐడీఈ టెక్నాలజీస్ డిప్యూటీ సీఈవో లీహి టోరెన్‌స్టైన్, ఇతర ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మంచి నీటిని వృథా చేయకుండా డీశాలినేషన్ నీటిపై దృష్టి పెట్టామన్నారు. ఇజ్రాయెల్ మొత్తం డీ శాలినేషన్ నీటినే వినియోగిస్తోందని, పారిశ్రామిక అవసరాలకు ఆ నీటినే వినియోగించాలని చెప్పారు. అవసరమైన పక్షంలో తాగునీటి అవసరాల కోసం కూడా డీశాలినేషన్ నీటినే వినియోగించే పరిస్థితి రావాలని సూచించారు. ఆ మేరకు ఆ ప్లాంట్‌ను అప్‌గ్రేడ్ చేసుకునేట్టు ఉండాలని పేర్కొన్నారు. ఎక్కడెక్కడ డీశాలినేషన్ ప్లాంట్లు పెట్టాలి అన్న దానిపై అధ్యయనం చేసి, ఆ మేరకు నివేదికలు ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. మొదట విశాఖపట్నంతో ప్రారంభించి.. దశల వారీగా విస్తరించుకుంటూ వెళ్లాలని సూచించారు. నిర్వహణ, ఖర్చు వివరాలతో నివేదిక విశాఖపట్నం, తడ, కృష్ణపట్నం తదితర ప్రాంతాల్లో డీశాలినేషన్ నీటిని వినియోగించేలా చూడాలని సీఎం సూచించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు డీశాలినేషన్ లేదా శుద్ధి చేసిన నీటిని వాడేలా చూడాలని, రాష్ట్రంలోని థర్మల్ ప్లాంట్లు కూడా ఆ నీటినే వినియోగించేలా ప్రణాళిక తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మురుగు నీటి శుద్ధికి అవుతున్న ఖర్చు, టెక్నాలజీపై కూడా దృష్టి పెట్టాలని, డీశాలినేషన్ ప్లాంట్ల సాంకేతికత, నిర్వహణ ఖర్చులపై సమగ్ర వివరాలు సమర్పించాలన్నారు. విశాఖపట్నం సహా ఆయా ప్రాంతాలను పరిశీలించి ఆ మేరకు నివేదికలు రూపొందించాలని, పరిశ్ర మలకు ఏ ప్రమాణాలతో నీరు కావాలో నిర్ణయించి ఆ మేరకు అన్ని అంశాలతో నివేదిక ఇవ్వాలని సూచించారు. 40 దేశాల్లో ఐడీఈ కార్యకలాపాలు ఇండియా అనేక రకాలుగా నీటి కొరతను ఎదుర్కొంటోందని, నీటి భద్రత అనేది చాలా ముఖ్యమని ఐడీఈ కంపెనీ ప్రతినిధులు వివరించారు. ఏపీలో నీటి కొరత తీర్చడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు హర్షణీయమన్నారు. ఇజ్రాయెల్, భారత్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. 1964లో తొలిసారిగా కమర్షియల్ డీశాలినేషన్ ప్లాంట్‌ను ఇజ్రాయెల్‌లో పెట్టామని వారు వివరించారు. ఐడీఈ టెక్నాలజీస్ ప్రపంచ వ్యాప్తంగా 4 దశాబ్దాలుగా 40 దేశాల్లో 400కు పైగా ప్లాంట్లను నిర్వహిస్తోందన్నారు. చైనా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోనూ తమ కంపెనీ కార్యకలాపాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. భారత్‌లో 25 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డీశాలినేషన్ ప్లాంట్ల వల్ల త్వరితగతిన పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాలు, ఆదాయం వస్తుందని వారు వివరించారు. సముద్రపు నీటిని డీశాలినేషన్ చేయడంతో పాటు కలుషిత నీటిని కూడా శుద్ధి చేయడంలో అత్యుత్తమ సాంకేతిక విధానాలను అవలంభిస్తున్నామన్నారు. ఎస్సార్, రిలయన్స్ కంపెనీల్లో ఇండస్ట్రియల్ మురుగు నీటి శుద్ధి కేంద్రాలను నిర్వహిస్తున్నామని, శుద్ధి చేసిన మురుగు నీటిని పరిశ్రమలు వినియోగించుకుంటున్నాయని వారు వివరించారు. -
రూ.37.65 కోట్లు ఇవ్వండి ప్లీజ్..
సాక్షి, సంగారెడ్డి: జిల్లాను కలవరపెడుతున్న తాగునీటి ఎద్దడి నివారణకు గ్రామీణ నీటి సరఫరా శాఖ ప్రభుత్వానికి రూ.37.65 కోట్లతో ప్రత్యామ్నాయ ప్రణాళికను అందజేసింది. కరువు, భూగర్భ జలమట్టాలు పడిపోవటం, రిజర్వాయర్లలో నీళ్లు నిండుకోవటంతో తాగునీటి ఇబ్బందులు మొదలయ్యాయి. గ్రామాల్లో బోరుబావులు ఇంకిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్యను ఎదుర్కొనేందుకు వీలుగా ఆర్డబ్ల్యూఎస్ రూ.37.65 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందజేసింది. సీఆర్ఎఫ్ కింద రూ.9.47 కోట్లతో 4,314 పనులు ప్రతిపాదించగా నాన్ సీఆర్ఎఫ్ కేటగిరిలో రూ.28.18 కోట్లతో 76,511 పనులను ప్రతిపాదించింది. తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయ బోరుబావులను అద్దెకు తీసుకోవటం, తాగునీటి రవాణా, బోరుబావులు, రక్షిత మంచినీటి పథకాల మరమ్మతులు, పైప్‌లైన్ పనులను అధికారులు ప్రతిపాదించారు. ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసిన వెంటనే గ్రామాల్లో తాగునీటి సమస్య నివారణ కోసం చర్యలు తీసుకోనున్నారు. 1,939 ఆవాసాల్లో ఎద్దడి.. జిల్లాలోని 1939 ఆవాస ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉన్నట్లు ఆర్డబ్ల్యూఎస్ యంత్రాంగం గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో ఉంటున్న 21.49 లక్షల మంది జనాభా తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు అధికారులు చెప్పారు. ఆయా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి సీఆర్ఎఫ్, నాన్ సీఆర్ఎఫ్ కేటగిరీల్లో నిధులు మంజూరవుతాయని చెబుతున్నారు. గతంలో తాగునీటి సరఫరా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నాన్ సీఆర్ఎఫ్ కింద భారీగా నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం కరువు పరిస్థితులు, నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం జిల్లా యంత్రాంగం కోరినంత మేర నిధులు మంజూరు చేసే అవకాశం ఉందని అంటున్నారు.