‘సీఎం జగన్‌ మరోసారి చరిత్రలో నిలిచిపోతారు’

YS Jagan Release Arrears For Co Operative Sugar Factory Workers - Sakshi

సాక్షి, విశాఖపట్నం : దశాబ్ద కాలంగా బకాయిలు చెల్లించకపోవడంతో సహకార చక్కెర కర్మాగారం రైతులు ఇబ్బందులు పడ్డారని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల సమస్యలు తెలుసుకొని ముఖ్యమంత్రిగా తన బాధ్యత నెరవేర్చారని ప్రశంసించారు. కాగా దివంగత మ‌హానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జ‌యంతిని వైఎస్సార్‌ రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ హయాంలో వడ్డీలేని రుణాల కోసం రైతులకు బకాయి పడ్డ 1054 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. దీంతో పాటు రాష్ట్రంలోని 5 సహకార చక్కెర కర్మాగారాల పరిధిలో రైతులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన 54.6 కోట్ల రూపాయల పాత బకాయిలను కూడా సీఎం జగన్‌ విడుదల చేశారు. ('మాది ఎన్నటికి రైతుల పక్షపాతి ప్రభుత్వమే')

మంత్రి అవంతి మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ రైతు పక్షపాతిగా మరోసారి చరిత్రలో నిలిచిపోయారన్నారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి వ్యవసాయానికి ఓ బ్రాండ్‌ అంబాసిడర్‌ అని, ఆయన జయంతి రోజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మర్చిపోలేని అనుభూతిని ఇచ్చారని అవంతి శ్రీనివాస్‌ కొనియాడారు.  రైతు భరోసా కేంద్రాలు ద్వారా విత్తనాలు దగ్గర నుంచి పంట ఉత్పత్తి కొనుగోలు వరకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుండటం హర్షనీయమన్నారు.(‘ఆయన పాలన గుప్తుల కాలాన్ని గుర్తు చేసింది’)

ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీకి చెందిన 5 వేల మందికి పైగా రైతులకు 10 కోట్ల రూపాయలు, తాండవకు చెందిన 4 వేల మంది రైతులకు సంబంధించి 9 కోట్ల రూపాయల బకాయిలు విడుదలయ్యాని తెలిపారు. రెండు చక్కెర కర్మాగారాలు బకాయిల చెల్లింపుకు నిధులు విడుదల చేయడం మాములు విషయం కాదని, బకాయిల చెల్లింపు తో మళ్ళీ చెరకు సాగు చేయడానికి రైతులు ముందుకు వస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. (అందుబాటులోకి 21 సంజీవ‌ని బస్సులు)

టీడీపీ హయాంలో సహకార చక్కెర కర్మాగారాలు నడవలేని స్థితిలో ఉండేవని యలమంచలి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కన్నబాబు విమర్శించారు. రెండేళ్లుగా బకాయిలు చెల్లించక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని బకాయిలను సెటిల్‌ చేయడం రైతులు ఊహించుకోలేదన్నారు. కాగా తాండవ, ఏటికొప్పాక రైతులకు ఈ రోజు ఎంతో పవిత్రమైన, అదృష్టమైన రోజు అని పాయకరావుపేట ఎమ్యెల్యే గొల్ల బాబురావు అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top