నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ గెలుపొందడటం... చంద్రబాబు విజయం అనుకుంటే పొరపాటేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
♦చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు
♦ అధికారం అడ్డుపెట్టుకుని ఉప ఎన్నికలో గెలుపు
♦నంద్యాల ఉప ఎన్నికలో రూ.200 కోట్లు ఖర్చు చేశారు
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ గెలుపొందడటం... చంద్రబాబు నాయుడి విజయం అనుకుంటే పొరపాటేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్ సీపీకి ఓటు వేసిన ఓటర్లకు, అలాగే ప్రలోభాలు, భయభ్రాంతుల మధ్య పార్టీ కోసం గట్టిగా నిలబడి కష్టపడ్డ కార్యకర్తలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై వైఎస్ జగన్ సోమవారం లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్‌లో మాట్లాడారు.
శిల్పా సోదరులకు హ్యాట్సాఫ్...
వైఎస్ జగన్ మాట్లాడుతూ... ‘అధికార పార్టీ నుంచి పదవికి రాజీనామా చేసి వైఎస్‌ఆర్ సీపీలోకి వచ్చి రాజకీయాల్లో విలువలు అన్న పదానికి అర్థం తీసుకొచ్చిన శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డికి హాట్సాప్. విలువలకు కట్టుబడి పదవులకు రాజీనామా చేసిన శిల్పా సోదరులకు అభినందనలు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ, ఎప్పటికీ విలువలకు కట్టుబడే ఉంది. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అధికార దుర్వినియోగం చేసింది. విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసింది. నంద్యాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది.
నంద్యాలలో టీడీపీ గెలుపు చంద్రబాబుది విజయం అనుకుంటే పొరపాటు. ఇది దిగజారుడు రాజకీయం మాత్రమే. ఎన్నికలలో హామీలు ఇచ్చి తర్వాత మోసం చేయడం చంద్రబాబుకు అలవాటే. సాధారణ ఎన్నికలు కాదు కాబట్టే టీడీపీ గెలిచింది. చంద్రబాబు తన అధికారం అడ్డం పెట్టుకుని గెలిచారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లాక్కొని ఓట్లు వేయించుకున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో చంద్రబాబు రూ.200 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఎన్నిక రిఫరెండం కాదు. చంద్రబాబుకు ఇప్పుడు సవాల్ విసురుతున్నా. మా పార్టీ గుర్తుపై గెలిచి, అనంతరం టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలు నిర్వహించాలి. ఆ ఎన్నికలను రెఫరెండంగా భావిస్తాం.’ అని అన్నారు.