
సాక్షి, అమరావతి: ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ‘నాడు– నేడు’లో భాగంగా ఇంగ్లిష్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధనపై శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీనియర్ అధికారులతో సమీక్షించారు. తొలి దశ కింద వచ్చే విద్యా సంవత్సరం 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మాధ్యమంలో బోధించాలని సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ), ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసీఎస్‌ఈ) విధానాలను పాటించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
6వ తరగతి వరకే ఎందుకంటే..
తొలుత 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిషు మాధ్యమంలో బోధించాలని నిర్ణయించినప్పటికీ, సమీక్ష అనంతరం మార్పులు చేస్తూ 1 నుంచి 6వ తరగతి వరకు పరిమితం చేశారు. ఆ తర్వాత 7, 8, 9, 10 తరగతులకు వరుసగా ఇంగ్లిషు మాధ్యమం ప్రారంభమవుతుంది. ఇలా ఎందుకంటే.. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విధానాల్లో పదవ తరగతికి దేశ వ్యాప్తంగా కామన్ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో ఇతర రాష్ట్రాల్లోని విద్యార్థులతో పోటీ పడాలంటే ఇప్పుడు 8వ తరగతి తొలిసారి ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థికి కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది.
ఆ స్థాయిలో సన్నద్ధం కావడానికి నాలుగేళ్లు పడుతుంది. 6వ తరగతి విద్యార్థి అయితే 10వ తరగతికి వచ్చే సరికి ఇంగ్లిషు బోధనను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాడు. ఈ దృష్ట్యా తొలి దశలో 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల బోధనను పరిమితం చేశారు. కాగా, ఇంగ్లిష్ ల్యాబ్‌ల వల్ల ప్రతి విద్యార్థి ఇంగ్లిష్ మీడియంలో పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకోగలుగుతారు. భాషపై త్వరగా పట్టు సాధించేలా వీటిని తీర్చిదిద్దుతారు.