భార్య షికారుకు రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు.
హైదరాబాద్: భార్య షికారుకు రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు. సరూర్‌నగర్ ఎస్‌ఐ నరేందర్ కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లాకు చెందిన వంశీకృష్ణ(26), చిత్తూరుకు చెందిన హిమబిందును ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలంగా వీరు దిల్‌సుఖ్‌నగర్ శారదానగర్‌లో ఉంటున్నారు. వంశీకృష్ణ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు.
శనివారం హిమబిందు పుట్టిన రోజు కావడంతో సాయంత్రం ఇద్దరూ కలిసి బయటకు వెళ్దామని భర్త అన్నాడు. ఇందుకు భార్య నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వంశీకృష్ణ రాత్రి సమయంలో గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు.
కొద్దిసేపటి తర్వాత భార్య తలుపు తట్టినా తీయలేదు. దీంతో బావమరిది వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా వంశీకృష్ణ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని మృతి చెంది ఉన్నాడు. ఈ మేరకు కుటుంబసభ్యులు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.