ఆ ఇద్దరు ఎవరు? | who are thier ? | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరు ఎవరు?

Jan 26 2014 4:10 AM | Updated on Sep 4 2018 5:07 PM

వీణవంక మండలం అయిలాబాద్‌లో ఈ నెల 22న అర్ధరాత్రి హత్యకు గురైన తోటి చంద్రయ్య కేసులో ప్రధాన నిందితుడు రామిడి రాజు హైదరాబాద్‌లో శుక్రవారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన విషయం విదితమే.

 వీణవంక, న్యూస్‌లైన్ :  వీణవంక మండలం అయిలాబాద్‌లో ఈ నెల 22న అర్ధరాత్రి హత్యకు గురైన తోటి చంద్రయ్య కేసులో ప్రధాన నిందితుడు రామిడి రాజు హైదరాబాద్‌లో శుక్రవారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన విషయం విదితమే. చంద్రయ్య హత్య జరిగిన రోజు ముగ్గురు వ్యక్తులు బైకుపై వచ్చారని, ఒకరు బైకు మీద ఉండగా, మరో ఇద్దరు ముఖానికి ముసుగులు ధరించి హత్యలో పాల్గొన్నారని మృతుడి భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో ఓ వ్యక్తి కత్తితో పొడవగా, మరో వ్యక్తి లక్ష్మిపై బీరుసీసాతో దాడిచేసి పరారైనట్టు పేర్కొంది.
 
 పోలీసులు ప్రధాన నిందితుడు రాజుగా నిర్ధారించి గాలింపు చేపడుతున్న క్రమంలో అతడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టించింది. మిగిలిన ఇద్దరు వ్యక్తులు ఎవ్వరనేది ప్రశ్నార్థకంగా మారింది. రాజు ఎవరినైనా కిరాయి వ్యక్తులను తీసుకొచ్చి చంద్రయ్యను హత్యచేశాడా? అయితే వారు ఎక్కడివారు? ప్రస్తుతం ఎక్కడున్నారు? పోలీసులు ఈ విషయాలపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. రాజు సెల్‌ఫోన్‌కు ఎవరెవరు ఫోన్ చేశారో పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. చంద్రయ్యను భూతగాదాలతోనే హత్య చేశారా? లేక మరేవైనా కారాణాలు ఉన్నాయా? అనే కోణంలో సైతం పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఆ ఇద్దరు దొరికితే రాజు మృతికి సంబంధించి వివరాలు తెలిసే అవకాశముందని భావిస్తున్నారు.
 
 రాజును గుర్తించిన కుటుంబసభ్యులు
 రాజు హైదరాబాద్‌లో మృతి చెందాడనే సమాచారం అందుకున్న తండ్రి రా మిడి రాంనర్సయ్య, తల్లి లచ్చమ్మ, బావ రాజయ్య అక్కడికి తరలివెళ్లారు.  ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో ఉంచిన రాజు మృతదేహాన్ని వారు గుర్తిం చినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. రాజు దేహం ముక్కలు ముక్కలుగా కాగా, శవాన్ని కరీంనగర్‌లోని తమ ఇంటికి తరలించి అంత్యక్రియలు చేశారు. కాచిగూడ రైల్వే హెడ్‌కానిస్టేబుల్ యాదగిరి కేసు నమోదు చేయగా, రాజుది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఆత్మహత్య చేసుకుంటే రాజు శరీరం ఎందుకు ముక్కలుగా విడిపోతుందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. పూర్తి నివేదిక పోస్టుమార్టం పైనే ఆధారపడినట్లు రైల్వే పోలీసులు ఇక్కడి పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement