కవలలకు కన్నీటి ‘పరీక్ష’  | Tenth Class Students Attend the SSC Exam Despite The Loss Of Father In Jagtial, Details Inside - Sakshi
Sakshi News home page

కవలలకు కన్నీటి ‘పరీక్ష’ 

Published Wed, Mar 20 2024 1:38 AM

Attend the exam despite the loss of father - Sakshi

తండ్రి పోయిన దుఃఖంలోనూ పరీక్షకు హాజరు 

జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లాల్లో విషాదాలు 

పెగడపల్లి(ధర్మపురి)/నిజామాబాద్‌ రూరల్‌: ఒకవైపు పదో తరగతి పరీక్ష.. మరో వైపు కన్నతండ్రి మరణం.. పుట్టెడు దుఃఖంలోనూ కవల బిడ్డలు పదో తరగతి పరీక్షకు హాజరయ్యారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన గాజె చంద్రయ్య–లక్ష్మి దంపతులకు మొదటి సంతానంలో కూతురు జన్మించింది. రెండో సంతానంగా ఇద్దరు కవలలు రామ్, లక్ష్మణ్‌ జన్మించారు.

వీరు స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వీరి తండ్రి చంద్రయ్య నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో పురుగు మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. కాగా, మృతుని కుమారులు మంగళవారం పదో తరగతి హిందీ పరీక్షకు హాజరు కావలసి ఉంది.

చదువుకు ఆటంకం కలగొద్దని బంధువులు, కుటుంబ సభ్యులు నచ్చజెప్పి రామ్, లక్ష్మణ్‌లను పెగడపల్లి మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. పుట్టెడు దుఃఖంతోనే కవల సోదరులు పరీక్ష రాశాక తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 

విషాదాన్ని దిగమింగి.. 
నిజామాబాద్‌ జిల్లా రూరల్‌ మండలం కేశాపూర్‌ గ్రామానికి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం బైక్‌ అదుపుతప్పి తాళ్ల కొత్తపేట్, మల్లారం వద్ద ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ రెడ్డిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మృతుని కుమారుడు ధనుష్‌ తీవ్ర దుఃఖంతోనే మంగళవారం శివాజీనగర్‌లోని శ్రీనూతన వైశ్య ఉన్నత పాఠశాలలో హిందీ పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.  

Advertisement
 
Advertisement