ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం

We work with the AP government says Katherine Hadda - Sakshi

అమెరికా కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ బీ హడ్డా

సీఎం వైఎస్‌ జగన్‌కు అభినందనలు

సాక్షి, అమరావతి:  ఏపీ ప్రభుత్వంతో కలసి పని చేయడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధంగా ఉందని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ బీ హడ్డా తెలిపారు. మంగళవారం సచివాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కేథరిన్‌ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఏపీ వారు  పెద్దసంఖ్యలో అమెరికాలో ఉన్నారని చెప్పారు. రెండు ప్రభుత్వాల మధ్య సంబంధాలు బలోపేతం కావాలని తాను కోరుకుంటున్నానన్నారు. విశాఖ నగరాన్ని స్మార్ట్‌ సిటీగా రూపొందించేందుకు అమెరికా సాంకేతిక సహకారాన్ని అందిస్తోందని, భవిష్యత్తులో మరింత సహకారం అందిస్తామని తెలిపారు.

మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ న్యూయార్క్‌ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న వేడుకల్లో భాగంగా గుంటూరు జిల్లా అమరావతిలో బౌద్ధుల సంస్కృతిని తెలియజేస్తూ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా విశాఖను ఆర్థికంగా, అభివృద్ధి పరంగా తీర్చిదిద్దే విషయంలో తనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. రాష్ట్రంలో తాను అమలు చేస్తున్న సామాజిక అభివృద్ధి అజెండాను, నవరత్నాల్లో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలను అమెరికా కాన్సుల్‌ జనరల్‌కు వివరించారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచనా ధృక్పథం తనను ఎంతో ఆకట్టుకుందని కేథరిన్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్‌ పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top