ఏ1 రవిబాబు అరెస్ట్‌పై అనుమానాల నీడలు | Visakhapatnam: DSP accused of rowdy Gedela Raju's murder | Sakshi
Sakshi News home page

ఏ1 రవిబాబు అరెస్ట్‌పై అనుమానాల నీడలు

Oct 17 2017 5:12 PM | Updated on Aug 20 2018 4:44 PM

Visakhapatnam: DSP accused of rowdy Gedela Raju's murder - Sakshi

అల్లిపురం(విశాఖ దక్షిణ): గేదెల రాజు హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆర్టీసీ విజిలెన్స్‌ డీఎస్పీ దాసరి రవిబాబు అరెస్ట్‌ జాప్యంపై పలు అనుమానాలు ముసురుకుంటున్నాయి. కేసును పక్కదోవ పట్టించేందుకు రవిబాబు తన సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అత్యున్నత స్థాయిలోనే పైరవీలు సాగిస్తున్నట్లు వినికిడి. అందుకు కాకర పద్మలత తండ్రి, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు, గేదెల రాజు భార్య కుమారి వివిధ పత్రికల్లో ఇచ్చిన స్టేట్‌మెంట్లు ఊతమిస్తున్నాయి. కాకర పద్మలత హత్యకు గురైందని, గేదెల రాజు సహకారంతో డీఎస్పీ రవిబాబు చేయించాడని పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో తనకు రావాల్సిన సుపారీ కోసం రవిబాబుపై గేదెల రాజు ఒత్తిడి తీసుకువచ్చినట్లు, ఈ నేపథ్యంలో అతడిని అడ్డు తొలగించుకునేందుకు భూపతిరాజు శ్రీనివాసరాజు సహకారంతో రాజును హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు.

రవిబాబుకు మద్దతుగా ప్రకటనలు!
ఈ కేసులో పోలీసులు ప్రెస్‌మీట్‌ పెట్టిన మరుసటి రోజే పద్మలత తండ్రి కాకర నూకరాజు మీడియా ఎదుట తన కుమార్తె మృతిపై తనకు అనుమానాలు లేవని ప్రకటించటం విస్మయానికి గురిచేసింది. మరో వైపు గేదెల రాజు భార్య కుమారి, పద్మలతను హత్య చేసేందుకు తన భర్త ఎటువంటి సుపారీ తీసుకోలేదని తేల్చి చెప్పారు. ఆమె కూడా పోలీసులు ప్రెస్‌మీట్‌ పెట్టిన మరుసటి రోజే మీడియా ఎదుటకొచ్చి తన భర్త మరణానికి ఆర్థిక పరమైన లావాదేవీలేవీ కారణం కాదని పేర్కొనటం పలు అనుమానాలకు తావిస్తోంది. కాకర పద్మలతను హత్య చేసేందుకు తన భర్త కోటి రూపాయలుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని, అందులో యాభై లక్షలు ఇచ్చారని, మరో యాభై లక్షల కోసం రవిబాబును అడిగినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కుమారి ప్రకటించటం వెనుక రవిబాబు ఒత్తిళ్లు ఉన్నట్లుగా సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనను డీఎస్పీ వేధిస్తున్నాడంటూ పద్మలత ఏడాది క్రితమే అప్పటి సీపీ అమిత్‌గార్గ్‌కు మొరపెట్టుకున్నప్పటికీ రవిబాబు ఒత్తిడి మేరకు ఆ ఫిర్యాదు స్వీకరించలేదనే విమర్శలు అప్పట్లో వినిపించాయి.

పోలీసుల అదుపులోనే నిందితులు..?
మరోవైపు నగర పోలీసుల అదుపులోనే గేదెల రాజు హత్య కేసులో ఏ1 నిందితుడు, డీఎస్పీ దాసరి రవిబాబు, ఏ2 నిందితుడు క్షత్రియభేరి దినపత్రిక ఎండీ భూపతిరాజు శ్రీనివాసరాజు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని మరో రెండు రోజుల్లో కోర్టులో హాజరుపరిచేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గేదెల రాజు హత్య జరిగిన మరుసటి రోజు నుంచే ప్రధాన నిందితులిద్దరూ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. శనివారం రాత్రి డీఎస్పీ దాసరి రవిబాబును స్టీల్‌ప్లాంట్‌ గెస్ట్‌ హౌస్‌లో ఉంచారని, అతను సూసైడ్‌ చేసుకునేందుకు ప్రయత్నించినట్లు, పోలీసులు అది గమనించి డాక్టరునే నేరుగా గెస్ట్‌ హౌస్‌కు పిలిపించి చికిత్స అందించినట్లు వదంతులు వచ్చాయి. అదే విధంగా భూపతిరాజు శ్రీనివాసరాజును కూడా సోమవారం సాయంత్రానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మంగళవారం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నిందితులను కోర్టులో హాజరుపరచడం వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు డీఎస్పీ రవిబాబు ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తనకు తెలిసిన న్యాయవాదుల నుంచి సలహాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement