సెంచరీ కొట్టేశాయ్‌గా..

Vegetables Are Essentially Growing To High Rates - Sakshi

సాక్షి, బాపట్ల(గుంటూరు) : కూరగాయల సంచిలో ధరల కుంపటి రగులుతోంది. రూ. 500 తీసుకెళ్తే సగం సంచి కూడా నిండని పరిస్థితుల్లో వంటింటిలో ధరల మంటలు చెలరేగుతున్నాయి. కొండెక్కి కూర్చున్న కూరగాయల ధరలు దిగిరానుంటున్నాయ్‌. నిత్యావసరాలు సెంచరీ కొట్టేశాయ్‌. వర్షాభావ పరిస్థితులు ఓ కారణమైతే.. కృత్రిమ కొరత చూపిస్తున్న వ్యాపారులు సామాన్యుడి జీవితంతో చెలగాటమాడుతున్నారు.
ఏంకొనేట్లు లేదు...ఏంతినేట్లులేదంటూ సగటు జీవి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. కూరగాయల ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశంకేసి దూసుకుపోతూ సామాన్యుడికి భారమవుతున్నాయి. ఈ ఏడాది వార్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతినడంతో ఆహారోత్పత్తులు అందుబాటులో లేవనే సాకు చూపి వ్యాపారులు రోజురోజుకూ ధరలను అమాంతం పెంచేస్తున్నారు. దీంతో సామాన్య ప్రజల ఇంట్లో పప్పులుడకడం లేదు. గంజినీళ్ళతో కడుపు నింపేసుకోవాల్సిన దుర్భర పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.

కందిపప్పు రూ.100 నాటౌట్‌..
కందిపప్పు ధర చుక్కల్ని తాకుతోంది. నిన్న మొన్నటి వరకు కిలో రూ.70 ఉన్న కందిపప్పు ప్రస్తుత ధర రూ.100కు చేరుకుంది. రోజురోజుకీ ధర పెరుగుతోందే తప్ప కిందికి దిగడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో నెలలోపే రూ.150 కు  చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీంతో పాటు మిగిలిన నిత్యావసర సరుకుల ధరలు తారాజువ్వల్లా దూసుకుపోతున్నాయి. బహిరంగ మార్కెట్లో గతంలో రూ.80 నుంచి రూ.90 ఉన్న మినపపప్పు ప్రస్తుతం కిలో రూ.140  నుండి రూ.160 ల వరకు చేరింది. చింతపండు ధర కిలో రూ.150 దాటింది. ఇక నూనెలు సలసల కాగుతున్నాయి. శనగనూనె కిలో రూ.85ల నుండి రూ.90 ల వరకు ఉంది. విడిగా కిలో నూనె రూ.95కి చేరింది. నిత్యావసరాల్లో ఏది కొనాలన్నా వంద రూపాయలపైనే ఉంటోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కూరగాయలదీ అదే తీరు..
నిత్యావసర వస్తువుల ధరలకు ఏమాత్రం తీసిపోనట్లుగా కూరగాయల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎండల ధాటికి కూరగాయల పంటలు ఎండిపోవడంతో దూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ ప్రభావం ధరలపై పడి సామాన్యులు కొనలేని స్థితికి చేరుకున్నాయి. టమోటా కిలో రూ.60, బెండకాయలు కిలో రూ.40, బంగాళాదుంపలు కిలో రూ.40, పచ్చిమిరపకాయలు కిలో రూ.80 లుగా ఉన్నాయి. ఏ కూరగాయలు కొనాలన్నా కిలో రూ.30 కంటే దిగువన ఉండటం లేదు. దీంతో.. ఉన్న వాటితో సర్దుకుపోతున్నామని వినియోగదారులు చెబుతున్నారు. 500 రూపాయలు బజారుకు తీసుకెళ్తే కనీసం నాలుగు రోజులకు సరిపడా కూరగాయలు కూడా రావడంలేదని ఆవేదన చెందుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top