ఎక్కడికైనా కలిసే వెళ్లాలి. ఏదైనా కలిసే పంచుకోవాలి. ఏం చేసినా కలిసే చేయాలి... రెండు లేత మనసుల స్నేహమిది. ఒకరిని విడిచి ఒకరుండలేని ప్రాయమది. పసి పిల్లల్ని పొట్టన పెట్టుకున్న మృత్యుపరిహాసమిది.
చెరువులో స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థినుల మృతి
Sep 12 2013 4:19 AM | Updated on Nov 9 2018 4:44 PM
ఎక్కడికైనా కలిసే వెళ్లాలి. ఏదైనా కలిసే పంచుకోవాలి. ఏం చేసినా కలిసే చేయాలి... రెండు లేత మనసుల స్నేహమిది. ఒకరిని విడిచి ఒకరుండలేని ప్రాయమది. పసి పిల్లల్ని పొట్టన పెట్టుకున్న మృత్యుపరిహాసమిది. ఇద్దరు స్నేహితురాళ్లను మింగేసిన చెరువు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. కానీ అచేతనులైన చిన్నారుల్ని చూసిన ప్రతి ఒక్కరి గుండె అక్షరాలా ‘చెరువైంది’. ఉత్తమ విద్యార్థినులుగా గుర్తింపు పొందిన ఇద్దరు స్నేహితురాళ్లు శవాలై తేలారని తెలిసి నడగాం గ్రామం కన్నీరు మున్నీరైంది.
నడగాం (నరసన్నపేట రూరల్), న్యూస్‌లైన్: విశాఖపట్నానికి చెందిన సుంకరి దివ్య (12) తాత వద్ద ఉంటూ నడగాం ప్రాథమిక పాఠశాల్లో 7వ తరగతి చదువుతోంది. అలిగి కృష్ణవేణి (13) తండ్రి భగవతి కూలి పనుల కోసం వలస వెళ్లడంతో తల్లి వరహాలు వద్ద ఉంటూ ఉర్లాం హైస్కూల్లో 8వ తరగతి చదువుతోంది. వీరిద్దరూ మంచి స్నేహితులు. చదువు సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో కలిసే ఉంటారు. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల పాఠశాలలు మూతపడటంతో ఇద్దరూ అలవా టు ప్రకారం సమీపంలోని నీళ్ల చెరువుకు స్నానానికి వెళ్లారు. దుస్తులను ఒడ్డున పెట్టి చెరువులోకి దిగారు. ఉదయం తొమ్మిది గంటల సమయంలో కృష్టవేణి తల్లి వరహాలు పొలంలో పని ముగించుకొని చెరువు మీదుగా ఇంటికి వెళ్తున్నప్పుడు ఒడ్డున వీరి దుస్తుల్ని గమనించింది. పిల్లలు మరిచిపోయారని భావించి వాటిని తీసుకొని ఇంటికి చేరింది.
ఉదయం 11 గంటలైనా పిల్లలు ఇళ్లకు చేరకపోవడంతో రెండు కుటుంబాల వారు ఆందోళనతో గ్రామమంతా వెతికినా ఆచూకీ తెలియలేదు. కృష్ణవేణి తల్లి వరహాలు ఇచ్చిన సమాచారం మేరకు చెరువులో గాలించగా మృతదేహాలు లభించడంతో అందరూ గొల్లుమన్నారు. సాధారణంగా నీళ్ల చెరువు వద్ద కనీసం నలుగురైదుగురు గ్రామస్తులుంటారు. బుధవారం విద్యార్థినులు స్నానానికి వెళ్లేటపుప్పుడు ఎవరూ లేకపోవడం ప్రమాదానికి కారణమైంది. ఉపాధి పనుల్లో భాగంగా చెరువులో మట్టి అధికంగా తవ్వడంతో బాగా లోతైంది. దీంతో పెద్దలు తప్ప పిల్లలెవరూ ఈ చెరువుకు స్నానానికి వెళ్లరు. సమీపంలోని వంశధార కాలువలో స్నానాలు చేస్తారు. దివ్య, కృష్ణవేణిలు కూడా కాలువలోనే రోజూ స్నానాలు చేసేవారు. మృత్యువు పిలిచినట్టే వీరిద్దరూ బుధవారం కాలువకు కాకుండా చెరువుకు వెళ్లి బలైపోయారు.
స్నేహితురాళ్లకు కన్నీటి వీడ్కోలు
దివ్య మరణించిందని తెలిసిన తండ్రి అప్పలసూరి విశాఖ నుంచి హుటాహుటిన నడగాం చేరుకున్నారు. సాయంత్రం గ్రామస్తులందరూ తరలిరాగా బాలికలకు అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల్లో వంశధార ప్రాజెక్టు మాజీ చైర్మన్ రాడ మోహనరావు, సర్పంచ్ రాడ చెల్లాయమ్మ, మాజీ సర్పంచ్ శ్రీనుబాబు, వైఎస్సార్ సీపీ నేతలు త్రినాథరావు, లుకలాపు రవి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినుల మృతికి ఉర్లాం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు వైకుంఠరావు, నడగాం పాఠశాల ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు. విద్యార్థినుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంఘటనపై గ్రామస్తులు ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని నరసన్నపేట ఎస్‌ఐ సత్యనారాయణ న్యూస్‌లైన్‌కు తెలిపారు.
Advertisement
Advertisement