తగ్గిన తుంగభద్ర ప్రవాహం

Tungabhadra River In Water Down Kurnool - Sakshi

కోసిగి(కర్నూలు): తుంగభద్ర నదీ మూడు రోజులుగా తగుముఖం పట్టింది. జూలై 18న కర్ణాటక హోస్పేట్‌ డ్యామ్‌ నుంచి నదికి నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే.  మొన్నటి వరకు కోసిగి మండలం అగసనూరు గ్రామ సమీపంలో తుంగభద్ర నదీ ఒడ్డున నిర్మించిన రాజోలి బండ డైవర్షన్‌ స్కీమ్‌ (ఆర్డీఎస్‌) ఆనకట్టపై రెండు అడుగులు ఎత్తు వరకు నీటి ప్రవాహం ఉంది.  శుక్రవారం ప్రవాహం ఆనకట్ట లెవల్‌ వరకు తగ్గిపోయింది. కర్నూలు వైపు కేవలం ఒక స్లూయిస్‌ నుంచి మాత్రమే దిగువకు ప్రవహిస్తున్నాయి. నీళ్లు తగ్గడంతో నదితీర ప్రాంత  రైతులు ఆందోళనకు గురువుతున్నారు.
  
సాగుకు నోచుకోని పంట పొలాలు : 
కర్ణాటక ప్రాంతంలో కురిసిన వర్షాలతో తుంగభద్ర నదికి నీళ్లు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. పదిహేను రోజులు గడవక ముందే నదిలో నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. నేటికి నదతీర పంట పోలాలు సాగుకు నోచుకోలేదు. వరినార   ఏర్పాటుకు రైతులు  అవస్థలు పడుతున్నారు. అంతలోనే నదీ ప్రవాహం తగ్గడంతో సాగుచేకున్న తర్వాత నదికి నీళ్లు వస్తాయో లేదోనని  రైతులు ఆందోళన చెందుతున్నారు.

నిండని ఎత్తిపోతల పథకాలు: 
ఎల్లెల్సీ చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందించే దిశగా నదితీరంలో నిర్మించిన ఎత్తి పోతల పథకాలు  నిండని కుండలుగా మారిపోయాయి. కోసిగి మండలంలోని దుద్ది ఎత్తి పోతల పథకం కింద 3200 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎత్తిపోతల పథకం వద్ద రెండు మిషన్‌లు పనిచేయడం లేదు. కేవలం నాలుగు రోజులు మాత్రమే ఒక మిషన్‌తో పంపింగ్‌ చేశారు.   మూడు మిషన్‌లు  మరమ్మత్తులకు గురైనా విషయం తెలిసినప్పటికీ  పట్టించుకునే నాథుడే కరువయ్యారు.  అలాగే మూగలదొడ్డి ఎత్తిపోతల పథకం, పులికనుమ రిజర్వాయర్‌ కూడా నిండేది కష్టమే.  ఎల్లెల్సీ చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తారా.. లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రైతులు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top