12 నామాలు పెట్టరు.. సెంట్‌ రాసుకొని తిరుగుతారు!

TTD Priests Slams Ex Chief Priest Ramanadeekhitulu - Sakshi

మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులుపై ప్రస్తుత అర్చకుల మండిపాటు

సాక్షి, తిరుమల: కలియుగదైవానికి పూజలు జరిపించే అర్చకుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. శ్రీవారి ఆభరణాలు మాయమవుతున్నాయంటూ, పోటు(వంటశాల)ను 22 రోజులపాటు మూసివేయడంలో కుట్రదాగుందంటూ తీవ్రస్థాయిలో అనుమానాలు వ్యక్తం చేసిన మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులుపై ప్రస్తుత అర్చకులు అంతేస్థాయిలో మండిపడ్డారు. రమణదీక్షితులు గొల్లపల్లి వంశానికి దత్తపుత్రుడని, 12 నామాలు పెట్టుకోకుండా స్వామివారికి కైకకర్యాలు చేస్తారని, కొడుకులకేమో అభిషేక విధులు అప్పగించి, మిగతావారికి ఆర్జితసేవ డ్యూటీలు వేసేవారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం తిరుమలలో ప్రధాన అర్చకులు, సంభవ అర్చకులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
(చదవండి: తొలగించిన బండల కింద ఏమున్నాయి: రమణ దీక్షితులు)

ఆయన 12 నామాలు పెట్టుకోరు..
‘‘25 ఏళ్లపాటు శ్రీవారి ఆలయం రమణదీక్షితులు ఆధ్వర్యంలోనే నడిచింది. కొత్తవారికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతోనే ఆయనకు రిటైర్మెంట్‌ ఇచ్చారు తప్ప మరో ఉద్దేశంలేదు. కానీ తనను, తన కుమారులను విధుల నుంచి తప్పించారని రమణదీక్షితులు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. ఆయనను ఆలయం నుంచి ఎవరూ బయటికి పంపలేదు. అయితే గడిచిన కాలమంతా ఆయన తీరుతో అందరూ ఇబ్బందులు పడ్డారు. నిజానికి శ్రీవారికి పంగనామాలు పెట్టిందే ఆయన. వారు ఏనాడూ 12 నామాలు పెట్టుకోలేదు. కానీ సెంటు రాసుకుని ఆడీకారులో తిరుగుతారు. అసలు 12 నామాలు లేనిదే స్వామివారికి కైకర్యాలు చేయకూడదు. ఆయన గొల్లపల్లి వంశానికి దత్త పుత్రుడు. కల్యాణోత్సవంలో కనీసం మత్రాలు చెప్పగలరా? తన కొడుకులకు మాత్రం అభిషేక విధులు వేస్తారు. మిగతావారికి ఆర్జితసేవల డ్యూటీలు కేటాయిస్తారు. స్వామివారికి బయటి నుంచి అన్నప్రసాదాలు తేవడం గతం(2001)లోనూ జరిగింది. ఇకపోతే, సౌందర రాజన్‌కు ఏం సంబంధం ఉందని ఈ ఆలయం గురించి మాట్లాడుతున్నారు? ఆత్రయబాబు ఒక న్యాయవాది. ఆయన కూడా రమణదీక్షితులును సమర్థించడమేంటి? ముఖ్యమంత్రి ముందే కంకణ బట్ట వస్ర్తం లాక్కున్నప్పుడు వీళ్లలో ఎవరూ మాట్లాడలేదు. 2013 నుండి నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నాను. ప్రధాన అర్చకుడిగా ఒకటే కోరుతున్నాను.. మంచిని నేర్పిస్తే మేము సహకరిస్తాం. చెడుకు ఎట్టిపరిస్థితుల్లో సపోర్ట్‌ చేయం. స్వామివారి సేవకు మూడో తరం వారికి అవకాశం వచ్చింది. బ్రాహ్మణ సంఘాలు, అర్చక సంఘాలు‌ ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని వేణుగోపాల దీక్షితులు అన్నారు.
(చూడండి: వజ్రం ఎక్కడైనా పగులుతుందా?)

ఆరోపణల్లో నిజంలేదు..
‘‘గత వారం రోజులుగా వినిపిస్తోన్న ఆరోపణల్లో ఏ ఒక్కటీ నిజంకాదు. స్వామివారికి నైవేద్యాలు, కైంకర్యాలు సకాలంలోనే జరుగుతున్నాయి. సేవల్లో మార్పులు జరిగాయంటే అది సమిష్టినిర్ణయంతో జరిగినవే. పోటులో ఇంతకుముందు కూడా చాలా మార్పులు జరిగాయి. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు మరమ్మత్తులు చేసిన విషయం గుర్తే. అన్ని సందర్భాల్లోనూ ఆగమ సలహాల ప్రకారమే నిర్ణయాలు జరిగాయి’’ అని కృష్ణశేషచల దీక్షితులు పేర్కొన్నారు.

రాయల నగలు చూపలేదు..
కైంకర్యపరులు 32 మందిమి ఉన్నాం. అందరికీ 65 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరాం. మిరాసి అర్చకుల మాదిరిగానే మాకూ నిబంధనలు వర్తింపజేయాలని అడిగాం. రిటైర్మెంట్ అనేది అర్చకులకు అవసరం. ఈ వయో పరిమితి ద్వారా వారి తర్వాతి వంశాలకు అవకాశం వస్తుంది. కైంకర్య పరుల పిల్లలకు కూడా ఆ అవకాశాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. స్వామివారికి కైంకర్యాల విషయంలో ఎలాంటి లోపం జరగలేదు. నగల విషయంలో వస్తున్న ఆరోపణలు కూడా నిరాధారమైనవి. రాయలవారి నగలు ఎక్కడా చూపలేదు. మైసూరు, గద్వాల్, వెంకటగిరి రాజావారలు ఇచ్చిన నగల వివరాలు మాత్రమే ఉన్నాయి. రమణదీక్షితులు నగలు తిరిగిచ్చినప్పుడు కూడా రాయల నగల ప్రస్తావనేలేదు. రమణధీక్షతుల కుమారులు కూడా కైంకర్యాలకు సరిగా రారు. ఇదేమని అడిగినందుకే అడిగినందుకే ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నారు. తోటి అర్చకులను ఆయన హీనంగా చూస్తారు..’’ అని కాత్తి నరసింహ దీక్షితులు అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top