పారదర్శకంగా సర్వే నిర్వహించాలి

పారదర్శకంగా సర్వే నిర్వహించాలి


సామర్లకోట/పెద్దాపురం :సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే పూర్తి పారదర్శకంగా చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. ఈ సర్వే నిర్వహణపై సామర్లకోట టీటీడీసీలో బుధవారం జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహశీల్దార్లు, మెప్మా అధికారులు, ఐటీడీఏ అధికారులు, డీఆర్‌డీఏ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి 82 రోజులపాటు సర్వే కార్యక్రమం కొనసాగుతుందన్నారు. దీనికి సంబంధించిన మెటీరియల్‌ను సంబంధిత అధికార కార్యాలయాలకు పంపించామన్నారు. ఈసర్వేలో ప్రతి కుటుంబ ఆర్థిక స్థితిగతులు, సమగ్ర సమాచారం, కుల వివరాలు, సామాజిక అంశాలు సేకరించాలన్నారు. ఈ సర్వేను ఆధారంగా చేసుకొనే నిధుల కేటాయింపు, బడ్జెట్ రూపకల్పన ఉంటుందన్నారు. గతంలో చేసిన సర్వేలో లోపాలు ఈ సర్వేలో లేకుండా అన్ని స్థాయిల్లో సిబ్బంది కృషి చేయాలన్నారు.

 

 సర్వేలో ప్రజలు పూర్తిగా భాగస్వాములయ్యేలా క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించాలన్నారు. అలాగే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఇందులో సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులను, అవసరమైతే భారత్ నిర్మాణ్ వలంటీర్లను భాగస్వాములను చేయాలన్నారు. జిల్లాలో 2011లో సేకరించిన సర్వే వివరాలను ఈ నెల 26వ తేదీన ప్రచురిస్తారని, ఆముసాయిదా జాబితాపై 30 రోజుల లోపు ప్రజల నుంచి ఫిర్యాదులు, ఆక్షేపణలను పరిష్కరించాలన్నారు. ముసాయిదా జాబితా ప్రచురించిన 52వ రోజు నుంచి 80వ రోజు వరకు అప్పీళ్లను పరిష్కరించాలన్నారు. 82వ రోజున తుది జాబితా ప్రచురించాలన్నారు. జాబితాను ప్రజలు తిలకించేందుకు వీలుగా ప్రతి ప్రభుత్వ కార్యాలయం, పంచాయతీ కార్యాలయం, గ్రామసంఘాల వద్ద ఉంచాలన్నారు.

 

  సెక్ రాష్ట్ర అధికారి రాంబాబు మాట్లాడుతూ 2011లో సేకరించిన డేటా ముసాయిదా జాబితాలోని దిద్దుబాట్లు, సవరణకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 2011లో గణన సమయంలో తొలగించబడిన నివాస స్థలం నుంచి దూరంగా ఉన్న ఆయా కుటుంబాలను చేర్చడానికి అవసరమైన సూచనలు చేశారు. డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్ రాజు మాట్లాడుతూ ఈసర్వే కార్యక్రమం విజయవంతానికి అధికారులు సహకరించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలన్నారు. అనంతరం పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమగ్ర సర్వేపై అవగాహన కల్పించారు. ట్రైనీ కలెక్టర్ శశాంక్, ఐటీడీఏ పీఓ గంధం చంద్రుడు, మెప్మా పీడీ శైలజావల్లి, ఆర్డీవోలు అంబేద్కర్, కూర్మనాథ్, సుబ్బారావు, శంకరవరప్రసాద్ పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top