మూడో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు శనివారం విజయవాడలో ప్రారం భం కానున్నాయి.
విజయవాడ బ్యూరో: మూడో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు శనివారం విజయవాడలో ప్రారం భం కానున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు దేశ, విదేశాల నుంచి 1,300 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సభలు జరుగుతున్న పటమట కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రాంగణానికి విశ్వనాథ సత్యనారాయణ సభా ప్రాంగణంగా నామకరణం చేశారు. శని వారం, ఆదివారం జరిగే ఈ సభల్లో తెలుగు భాష, వికాసానికి సంబంధించి 11 సదస్సులు నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, భావోద్వేగాలను అధిగమించి తెలుగును కాపాడుకోవడానికి చేపట్టాల్సిన చర్యల గురించి ప్రధాన చర్చ జరగనుంది.
ఈ అంశాల్లో రచయితల బాధ్యత, ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి పలు తీర్మానాలు చేయనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభ సభలో పాల్గొం టారు. ఆదివారం ముగింపు సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ పాల్గొంటారు. విదేశీ ప్రతినిధులు, ప్రముఖ సినీ రచయితలు నటులు మహాసభలకు హాజరవుతున్నారు. ప్రతినిధులకు రెండురోజూలూ సంప్రదాయ తెలుగు వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేశారు.
30 మందికి తెలుగు పద్యపేటికలు
మహాసభలకు హాజరవుతున్న 30 మంది విశిష్ట అతిథులకు తాళపత్రాలతో తయారుచేసిన తెలుగు పద్య పేటికలను బహూకరించనున్నారు. నన్నయ నుంచి సి. నారాయణరెడ్డి వరకూ తెలుగు కవులు రచించిన ముఖ్య పద్యాలన్నింటినీ తాళపత్రాల్లో ముద్రించారు. బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ తంగిరాల వెంకట సుబ్బయ్య వీటిని తయారు చేశారు. కాగా, మహాసభలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం సాయంత్రం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు వాటిని పరిశీలించారు.