ఉద్యోగం దొరకలేదని చోరీ | Sakshi
Sakshi News home page

ఉద్యోగం దొరకలేదని చోరీ

Published Wed, Jun 13 2018 2:26 PM

Theft Is Not Found In The Job - Sakshi

సాక్షి,అన్నానగర్‌ : ఉద్యోగం దొరకలేదని విరక్తితో ఎంబీఏ పట్టభద్రుడు 12 సవర్ల నగలను చోరీ చేశాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై తిరువికనగర్‌ ప్రభు వీధికి చెందిన అరివళగన్‌. ఇతను కుటుంబంతో మంగళవారం బయటికి వెళ్లి ఇంటికి వచ్చాడు. అప్పుడు తలుపులు తెరచి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న 12 సవర్ల నగలు చోరీ అయినట్టు తెలిసింది. అరివళగన్‌ తిరువికనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సహాయ కమిషనర్‌ హరికుమార్‌ ఆధ్వర్యంలో సీఐ రమణి, పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేశారు. అప్పుడు బీరువాలో ఉన్న రూ. 70వేలు నగదు చోరీకి గురికాలేదు. దీంతో అరివళగన్‌కి తెలిసిన వారు ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానించారు. బాడుగకు ఉన్నవారి వద్ద పోలీసులు విచారణ చేశారు. అప్పుడు తూత్తుకుడి జిల్లా ఉడన్‌కుడికి చెందిన ఇళమదిని పోలీసులు విచారణ చేశారు. విచారణలో అతను నగలు చోరీ చేసినట్లు నేరం అంగీకరించాడు. పోలీసుల విచారణలో ఇళమది ఎంబీఏ చదివి ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ఇతను అరిశలగన్‌ ఇంట్లో మూడు నెలల ముందు బాడుగకు చేరాడు. అరివళగన్‌ లగ్జరీ జీవితం చూసిన ఇళమది అతని ఇంట్లో చోరీ చేయాలని పథకం వేశాడు. 


దీని ప్రకారం మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నగలను చోరీ చేసిన ఇళమది వాటిని తన భార్యకు ఇచ్చాడు. భార్య మందలిచ్చి తీసిన స్థలంలో నగలను పెట్టాలని బుద్ధి చెప్పింది. నగలను బీరువాలో పెట్టడానికి ఇళమది వెళ్లేలోపు అరివళగన్‌ వచ్చాడు. దీంతో నగలను ఓ బంధువు వద్ద ఇచ్చి ఇళమది ఇంటికి వచ్చాడు. ఫిర్యాదు ఇచ్చిన ఆరుగంటల సమయంలోనే ఇళమదిని అరెస్టు చేసి నగలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.  

Advertisement
Advertisement