 
															గిరిధర్ భౌతికకాయూనికి పోస్టుమార్టం
ప్రభుత్వ సర్వజనాస్పత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గిరిధర్ భౌతికకాయూనికి పోస్టుమార్టం పూర్తీ అయ్యింది.
	అనంతపురం రూరల్ : ప్రభుత్వ సర్వజనాస్పత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గిరిధర్ భౌతికకాయూనికి పోస్టుమార్టం పూర్తీ అయ్యింది. శనివారం ఉదయమే కావాల్సిన పోస్టుమార్టం ఇక్వెస్ట్, రిక్వెస్ట్ ఆలస్యంగా ఇవ్వడంతో జాప్యం జరిగింది. పోస్టుమార్టంను డాక్టర్ మహేష్ చేశారు. అంతకుముందు టూటౌన్ పోలీసులతో డాక్టర్ గిరిధర్ సోదరుడు విజయ్‌కుమార్, బంధువులు ఏకీభవించలేదు.
	
	పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఉన్నత భావాలు కల్గిన వ్యక్తి అన్నారు. మృతిపై తమకు అనుమానాలున్నాయని తెలిపారు. వాస్తవంగా ఉరి వేసుకున్న కొక్కి వద్ద కనీసం పగుళ్లు కూడా రాలేదన్నారు. స్పందించిన టూటౌన్ సీఐ మన్సూరుద్దీన్ మొదట ఆత్మహత్యగా కేసు నమోదు చేశామని, మీకేమైనా అభ్యంతరాలుంటే పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత చూసుకోవాలని నచ్చజెప్పారు.
	
	 తరలి వచ్చిన విద్యార్థులు
	 తమ వైద్యుడు మృతి చెందారని తెలియడంతో మెడిసన్ విద్యార్థులు వందల సంఖ్యలో మార్చురీకి తరలివచ్చారు. సార్‌ను...చివరిసారిగా చూస్తున్నామంటూ  పలువురు విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు. ఏమైనా సమస్యలుంటే ఒకటికి రెండు సార్లు చెప్పేవారని, అటువంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందని పేర్కొన్నారు.
	
	మంచి వ్యక్తిని కోల్పోయాం : వైద్య కళాశాల ప్రిన్సిపాల్
	డాక్టర్ గిరిధర్ మంచి వైద్యుడని, అటువంటి వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందడం  బాధకరమని వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.నీరజ పేర్కొన్నారు. వైద్య కళాశాల ఆడిటోరియంలో సంతాప సభ శనివారం నిర్వహించారు. ప్రిన్సిపాల్‌తో పాటు సూపరింటెండెంట్ డాక్టర్ కె.ఎస్.ఎస్.వెంకటేశ్వరరావు, చిన్ని పిల్లల విభాగాధిపతి డాక్టర్ మల్లేశ్వరి, ఫోరెన్సిక్ హెచ్‌డీఓ డాక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు గిరిధర్‌కు నివాళులర్పించారు. ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.బాబు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
