రాష్ట్రం విడిపోతే మరో జిల్లా కేంద్రంగా ఏర్పడుతుందనే ఊహాగానాలు ఉన్న నంద్యాల పట్టణంలో అభివృద్ధి పడకేసింది. బూతద్దంలో వెతికినా దాని జాడలు కనిపించడం లేదు.
నంద్యాల, న్యూస్‌లైన్: రాష్ట్రం విడిపోతే మరో జిల్లా కేంద్రంగా ఏర్పడుతుందనే ఊహాగానాలు ఉన్న నంద్యాల పట్టణంలో అభివృద్ధి పడకేసింది. బూతద్దంలో వెతికినా దాని జాడలు కనిపించడం లేదు. వరద రక్షణ గోడ, అండర్ డ్రెయినేజీ, రహదారుల విస్తరణ పనులు నిలిచిపోవడం ఇక్కడి ప్రజలకు శాపంగా మారింది. 2007లో వచ్చిన వరదలతో పట్టణం అతలాకుతలమైంది. ఈ ప్రాంతాన్ని పరిశీలించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పరిస్థితులను చూసి చలించి తక్షణమే వరద నివారణ పనులు చేపట్టాలని రూ. 98 కోట్లు మంజూరు చేశారు. చామకాల్వ, మద్దిలేరు, కుందూ వాగు నుంచి వరద నీరు పట్టణంలోకి రాకుండా చర్యలు చేపట్టారు. అప్పుడు ప్రారంభమైన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. భూ సేకరణ అడ్డంకిగా మారడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో రూ.74 కోట్ల నిధులు మురిగిపోతున్నాయి. సకాలంలో పనులు పూర్తి చేయకపోవటంతో 2009లో వచ్చిన వరదలతో ప్రభుత్వంపై అదనంగా రూ. 20 కోట్లు భారం పడింది.
ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు ఉన్నాయి. ప్రతి ఏడాది వర్షాకాలంలో వరద భయంతో ప్రజలు వణికిపోతున్నా సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదు. అలాగే పట్టణంలోని 50 వేల కుటుంబాలను మురికి నుంచి విముక్తి కల్పించడానికి అండర్ డ్రెయినేజి పనులకు వైఎస్‌ఆర్ రూ. 74 కోట్లతో నిధులు మంజూరు చేశారు. ఆ వెంటనే సిమెంటు రోడ్లను తవ్వేసి పనులు ప్రారంభించారు. అయితే కొన్నాళ్ల తర్వాత నిధుల విడుదలలో జాప్యంతో పనులు నిలిచిపోయాయి. దీంతో రహదారులపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఐదేళ్లు కావస్తున్నా పనులు ఒక్క అడుగుకూడా ముందుకు సాగలేదు. అయితే ఒక్క చోట కూడా పూర్తి స్థాయిలో పనులు చేపట్టక పోయినా రూ. 28 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పనులు పూర్తయ్యేందుకు ఎమ్మెల్యే నిధులు విడుదల చేయించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
రహదారుల విస్త‘రణం’..
పట్టణంలో రహదారుల విస్తరణ కలగా మారింది. విజయ డెయిరీ నుంచి ఎన్జీఓ కాలనీ మీదుగా ఆత్మకూరు బస్టాండ్ వరకు, అలాగే నంది డెయిరీ నుంచి ప్రభుత్వ కళాశాల మీదుగా ఆర్టీసీ బస్టాండ్, పద్మావతి నగర్ రహదారుల విస్తరణ చేయాలని ప్రతిపాదించారు. రహదారులపై ఆక్రమణలను తొలగించడానికి ఎమ్మెల్యే ప్రయత్నాలు ఆరంభించారు. ఇందుకోసం రూ. 20 కోట్లకు పైగా వ్యయం అవుతుందని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఆక్రమణలు తొలగించేందుకు అవసరమైన నిధులను మున్సిపాలిటీనే భరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ఎమ్మెల్యే ఏదైనా చేస్తారని భావించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. అలాగే పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపడతామని ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చే పరిస్థితి కనిపించటం లేదు.