పార్వతీపురం రూరల్: ఇంటి ఖర్చుల కోసం డబ్బు అడిగినందుకు ఆగ్రహించిన భర్త తాగిన మైకంలో భార్యను గొడ్డలితో నరికి చంపిన ఘటన శనివార0 బందలుప్పి గ్రామంలో చోటు చేసుకుంది.
పార్వతీపురం రూరల్: ఇంటి ఖర్చుల కోసం డబ్బు అడిగినందుకు ఆగ్రహించిన భర్త తాగిన మైకంలో భార్యను గొడ్డలితో నరికి చంపిన ఘటన శనివార ం బందలుప్పి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. బందలుప్పి గ్రామానికి చెందిన తిరుమరెడ్డి లక్ష్మణరావు కూలి పనికి వెళ్లి ఇంటికొచ్చాడు. ఇంటి ఖర్చుల కోసం డబ్బు కావాలని అతడి భార్య వరలక్ష్మి(45) అడిగారు. అప్పటికే మద్యం తాగివున్న భర్త లక్ష్మణరావు ఆమెపై మండిపడ్డాడు.
ఇంటిలో వున్న గొడ్డలితో మెడపై బలంగా నరికాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై వరలక్ష్మి అక్కడికక్కడే మరణించారు. వరలక్ష్మి మృతదేహాన్ని బంధువులు, చుట్టుపక్కలవున్నవారు చూసేసరికి లక్ష్మణరావు పారిపోయాడు. లక్ష్మణరావు గతంలో తన అత్తను చంపాడని, అయితే పిల్లల భవిష్యత్ దృష్ట్యా విషయాన్ని బయటకు పొక్కకుండా సద్దుమణిగించినట్లు బంధువులు, గ్రామస్తులు చెబుతున్నారు. ఘటనాస్థలాన్ని ఏఎస్పీ సిద్ధార్థ కౌశిల్, సీఐ చంద్రశేఖరరావు, ఎస్‌ఐ వి.ఎన్.మూర్తి పరిశీలించారు.
హత్యకు జరిగిన కారణాలను బంధువులు, గ్రామస్తులను అడిగితెలుసుకున్నారు. స్వయంగా మృతురాలి కుమారులే హత్య జరిగిన తీరును వారికి వివరించారు. మృతురాలి పెద్ద కొడుకు పార్ధసారధి బొబ్బిలి తాండ్రపాపారాయ ఇంజనీరింగ్ కళాశాలల్లో బీటెక్ పూర్తిచేయగా రెండవ కుమారుడు శివకృష్ణ సీతానగరం మండలం మరిపివలసలోవున్న పాలిటెక్నిక్ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్నాడు. తండ్రే ఇంతటి దారుణానికి పాల్పడటంతో వీరు తట్టుకోలేకపోతున్నారు. వీరి పరిస్థితి చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు.