బస్సు డ్రైవర్ సజీవదహనం | The bus driver was burned alive | Sakshi
Sakshi News home page

బస్సు డ్రైవర్ సజీవదహనం

Sep 10 2014 1:58 AM | Updated on Sep 2 2017 1:07 PM

బస్సు డ్రైవర్ సజీవదహనం

బస్సు డ్రైవర్ సజీవదహనం

ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సును డీసీఎం వ్యాన్ ఢీకొన్న ఘటనలో దురదృష్టవశాత్తు డ్రైవర్ గంగాధర్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు.

ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీ  
 పలువురు ప్రయాణికులకు స్వల్పగాయాలు
తప్పిన భారీ ముప్పు మూలమలుపు వల్లే ప్రమాదం

 
హైదరాబాద్:  ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సును డీసీఎం వ్యాన్ ఢీకొన్న ఘటనలో దురదృష్టవశాత్తు డ్రైవర్ గంగాధర్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. ప్రయాణికులు మాత్రం గాయాలకు గురైనప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం లేకుండా బయటపడగలిగారు. ఆర్మూర్ డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు  (ఏపీ25జెడ్0064) సోమవారం మధ్యాహ్నం 58 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లతో నెల్లూరు జిల్లా వింజమూరు నుంచి ఆర్మూర్‌కు బయలుదేరింది. మంగళవారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు జూబ్లీ బస్‌స్టేషన్‌కు చేరుకుని బస్సు తిరిగి బయలుదేరింది. బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలోని మూలమలుపులోకి ప్రవేశించింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న  డీసీఎం వ్యాన్.. బస్సు ను బలంగా ఢీకొట్టింది.

దీంతో వ్యాన్ ముందు భాగం బస్సు లోపలికి చొచ్చుకునిపోయి బస్సు డీజిల్ ట్యాంక్ పగిలింది. వెంటనే బస్సులో మంటలు అంటుకొని డ్రైవర్ గంగాధర్ సజీవ దహనం కాగా, ప్రయాణికులు మాత్రం అత్యవసర ద్వారం గుండా కొందరు, అద్దాలు పగులగొట్టుకొని మరికొందరు బయటపడ్డారు. ఈ ఘటనలో మరో డ్రైవర్ మధుతో పాటు ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ మధును తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేసిన అనంతరం గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు  చేపట్టారు. స్వల్పంగా గా యపడ్డ మరో 15 మంది ప్రయాణికులకు 108 వాహనంలో చికిత్స చేసి పంపారు. కాగా బస్సు ప్రమాదంలో ప్రధాన నిందితుడు డీసీఎం డ్రైవర్ బహదూర్ వాసియైన ఖాజామొయినుద్దీన్(45)ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

 డ్యూటీ మారిన 10 నిమిషాలకే..

 అప్పటివరకు బస్సు నడిపిన డ్రైవర్ మధు (ఆర్మూర్) జూబ్లీ బస్‌స్టేషన్‌లో డ్యూటీ దిగి, రెండవ డ్రైవర్ గంగాధర్ (నిజామాబాద్ జిల్లా బాల్కొండ సమీప  గ్రామానికి చెందిన)కు బస్సును అప్పగించాడు. జేబీఎస్ నుంచి  బయలుదేరిన 10 నిమిషాలకే యా క్సిడెంట్ అయింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా,  గంగాధర్ కాళ్లు బస్సు క్యాబిన్‌లోనే ఇరుకున్నాయి. ‘నన్ను కాపాడండి’ అని అతడు దీనంగా ఆర్తనాదాలు చేశాడు. కానీ అప్పటికే డీజిల్ ట్యాంకు పేలి మంటలు చెలరేగడంతో  మృత్యువాత పడ్డాడు. అయితే ఆ సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్‌ఎస్‌ఐ వేణు డ్రైవర్‌ను కాపాడేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. కానీ భారీ మంటలు వ్యాపించడంతో ఫలితం లేకపోయింది.  
 ‘టిమ్స్’మిషన్ కారణమా..?
 టికెట్ ఇష్యూ మిషన్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. బోయిన్‌పల్లి వద్ద బస్సు నడుపుతున్న డ్రైవర్ గంగాధర్ ఒక చేత్తో బస్సు నడుపుతూనే మరో చేత్తో టిమ్స్ మిషన్‌ను గేర్‌బాక్స్‌పై ఉంచేందుకు రోడ్డుపై నుంచి దృష్టి మరల్చాడు. ఆ స్వల్ప వ్యవధిలోనే బస్సు కుడివైపునకు వెళ్లిందని, ఎదురుగా వస్తున్న డీసీఎం బస్సును ఢీకొట్టిందని తిరుపతయ్య, వినుకొండకు చెందిన వీరాంజనేయులు అనే ప్రయాణికులు తెలి పారు. వినాయక నిమజ్జనం సందర్భంగా బందోబస్తులో ఉన్న బోయిన్‌పల్లి బ్లూకోట్ పోలీసులు, సీఐ సుధీర్‌కుమార్, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు తీసుకున్నారు.  
 దురదృష్టకరం : రవాణా మంత్రి  
 రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ సీహెచ్ మల్లారెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమా దం జరిగిన తీరును  తెలుసుకున్నారు. సజీవ దహనమైన డ్రైవర్ గంగాధర్ కుటుంబానికి రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యో గం ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. డ్రైవర్ కుటుంబ సభ్యుల రోదనలతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది.  కాగా ఆర్టీసీ డ్రైవర్ గంగాధర్ కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ డిమాండ్ చేసింది. ఓ ఆర్టీసీ డ్రైవర్  సజీవ దహనం కావడం ఆర్టీసీ చరిత్రలోనే గతంలో ఎన్నడూ జరగలేదని ఎన్‌ఎంయూ అధ్యక్షకార్యదర్శులు ఎం.నాగేశ్వరరావు, సయీద్ మహమూద్‌లు ఓ ప్రకటనలో తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement