పదో తరగతి విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. రావులపాలెం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రావులపాలెం
రావులపాలెం : పదో తరగతి విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. రావులపాలెం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రావులపాలెం మండలం లక్ష్మీపోలవరానికి చెందిన ఆ బాలిక అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ, పక్క గ్రామమైన పొడగట్లపల్లి హైస్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. ఈనెల ఆరున ఉదయం పాఠశాలకు వెళుతుండగా ఆ గ్రామానికి చెందిన గెద్దాడ శ్రీను అనే యువకుడు, మరో నలుగురు అటకాయించారు.
ఆమెను సమీపంలో ఉన్న ఒక ఇంటిలోకి లాక్కుపోయి లైంగికదాడి జరిపారు. బాలిక కేకలు విని కొందరు రావడంతో అయిదుగురూ పరారయ్యారు. విషయం తెలిసిన బాలిక పిన్ని ఆమెను అడిగి వివరాలు తెలుసుకుంది. జరిగిన దారుణాన్ని గ్రామ పెద్దల దృష్టిలో పెట్టారు. అయినా న్యాయం జరగకపోవడంతో సోమవారం బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కొత్తపేట ఆస్పత్రికి తరలించారు. అమలాపురం డీఎస్సీ ఎం.వీరారెడ్డి దర్యాప్తు చేస్తున్నారని ఎస్సై బీఎస్ అప్పారావు తెలిపారు.