రౌడీ ఏజెంట్లు..

The Telugu Desam Party Strategy Is Aimed at Preventing Counting By Creating Electoral Counting. - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎన్నికల కౌంటింగ్‌ వేళ ఫలితం తేడా వస్తే అలజడి సృష్టించడం ద్వారా కౌంటింగ్‌ను అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ వ్యూహం పన్నుతోంది. ఓటమి తప్పదని భావిస్తున్న ఆ పార్టీ ఓట్ల లెక్కింపు సమయంలో అల్లర్లు సృష్టించేందుకు వీలుగా  భుజబలం ప్రదర్శించే వారిని ఏజెంట్లుగా నియమించి కౌంటింగ్‌ హాళ్లలోకి పంపాలని నిర్ణయించినట్టు సమాచారం. వీరిద్వారా అలజడి సృష్టించేందుకు పెద్ద ఎత్తున ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కొందరు ఆ పార్టీ కార్యకర్తలపైనే నమ్మకం లేక సొంత కుటుంబానికి చెందిన వారినే కౌంటింగ్‌ ఏజెంట్లుగా కూర్చొబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తమ పార్టీ వారితో పాటు కాంగ్రెస్, జనసేన, ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థుల తరఫున కూడా టీడీపీ కార్యకర్తలను ఏజెంట్లుగా పెట్టేందుకు ఇప్పటికే దరఖాస్తులు ఇచ్చినట్లు  సమాచారం. జిల్లా కేంద్రంలో అధికార పార్టీ అభ్యర్థి పూర్తిగా తన సొంత మనుషులపైనే ఆధారపడ్డారు.

ఒకరిద్దరు పార్టీ నాయకులు మినహాయిస్తే మిగిలిన వారందరూ తన సోదరులు, సొంత బంధువర్గంపైనే ఆధారపడ్డారు. తన ఇద్దరు సోదరులు, అల్లుడు, బావ, ఇతర దగ్గరి బంధువులు, సొంత మనుషులనే ఏజెంట్లుగా నియమించినట్టు తెలుస్తోంది. మరో పార్టీ అభ్యర్థిని మేనేజ్‌ చేసి అతని ఏజెంట్లుగా కూడా తెలుగుదేశం పార్టీ వారినే కూర్చొపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఏజెంట్ల జాబితాలు సిద్ధం చేసుకున్నారు. అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అవసరమైతే కౌంటింగ్‌లో అల్లరి చేయడానికి సిద్ధంగా ఉండేవారిని, వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని నియమించే యత్నం చేస్తున్నారు.

ఇతర పార్టీల ఏజెంట్లూ టీడీపీవారే!
ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గాల వారీగా ఉన్న టేబుళ్లలో ఒక్కో టేబుల్‌కు ఒక్కో ఏజెంట్‌ను నియమించాల్సి ఉంటే వారి ఏజెంట్లతోపాటు కాంగ్రెస్, జనసేన, ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థుల తరఫున కూడా టీడీపీ కార్యకర్తలనే ఏజెంట్లుగా పెట్టేందుకు ఇప్పటికే దరఖాస్తులు ఇచ్చినట్లు సమాచారం.  పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, నాయకుల ముసుగులో రౌడీ షీటర్లను, నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులను ఏజెంట్లుగా నియమించి కౌంటింగ్‌ హాలులో అల్లరి సృష్టించేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు బహిరంగంగానే ప్రచారం సాగుతోంది. 
 

డీఎస్పీలకు మౌఖిక ఆదేశాలు 
అధికారులు వివిధ పార్టీల నుంచి వచ్చిన ఏజెంట్ల జాబితాలను కంప్యూటరీకరించి వాటిని పార్లమెంటరీ నియోజక వర్గాల పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల వారీ జాబితాలను సిద్ధం చేసి వారి చిరునామాలతోపాటు ఫొటోను ఎంక్వయిరీ చేసి నివేదిక ఇవ్వాలని డివిజనల్‌ పోలీస్‌ అధికారులు (డీఎస్పీ)లకు పంపిస్తారు. అయితే అక్కడ డీఎస్పీలు వీటిని పరిశీలించకుండానే కొంత మంది సిబ్బందికి ఇచ్చి తూతూ మంత్రంగా వాటిని చూసి తిరిగి కలెక్టరేట్‌కు పంపించేందుకు సహకరించాలని ఇప్పటికే రాష్ట్రస్థాయిలో ఒక ఉన్నతాధికారి నుంచి  జిల్లాస్థాయి అధికారులకు మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు చెబుతున్నారు.  జిల్లాలో రెండు పార్లమెంట్‌ స్థానాలతోపాటు 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు  జరిగాయి.  పోలింగ్‌ సరళి ప్రకారం జిల్లాలో ఈసారి అధికార పార్టీకి గడ్డుకాలం తప్పదన్న ప్రచారం జరుగుతోంది. దీన్ని ఎదుర్కొనేందుకు టీడీపీ కుట్ర రాజకీయాలకు తెరతీస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. 

ప్రతి పార్టీకి 15 మంది చొప్పున ఉండాలి 
పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు రౌండ్‌కు 14 టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో టేబుల్‌కు ఒక్కో ఏజెంటు ప్రతి పార్టీ నుంచి ఉంటారు. అలాగే ఒక్కో నియోజకవర్గానికి ఒక జనరల్‌ ఏజెంట్‌ ఉంటారు. ఈ లెక్కన ప్రతి పార్టీకి 15 మంది అసెంబ్లీకి, 15 మంది పార్లమెంటుకు ఏజెంట్స్‌ ఉంటారు. వైఎస్సార్‌ సీపీకి నియోజకవర్గానికి 15 మంది ఉంటే,  తెలుగుదేశం పార్టీ మాత్రం కాంగ్రెస్, జనసేన, ఇతర పార్టీల నుంచి వచ్చిన ఏజెంట్లతో కలిపితే 45 నుంచి 60 మంది ఏజెంట్లు ఉండేలా చూసుకుంటున్నారు.

ఏజెంట్ల పేర్లతో కూడిన జాబితాలను ఈ నెల 16వ తేదీలోగా అందజేయాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు ఇచ్చారు. కొన్ని నియోజకవర్గాల నుంచి జాబితాలు ఇప్పుటికే అధికారులకు చేరాయి. స్వతంత్ర అభ్యర్థులు మాత్రం ఇంత వరకూ సంబంధిత జాబితాలు ఇవ్వలేదని తెలుస్తోంది. నేరచరితుల పేర్లను ఏజెంట్లుగా ప్రతిపాదిస్తే వారిని తొలగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లను తట్టుకుని అధికారులు నిజాయితీగా వ్యవహరిస్తారో లేదో ఒకటి రెండురోజుల్లో తేలిపోతుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top