
ఎన్టీఆర్ ఆశీస్సులతోనే టీడీపీ విజయం
తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీ తదితర హామీలన్నిటినీ పార్టీ అధినేత చంద్రబాబు తప్పకుండా నెరవేరుస్తారని సినీ నటుడు నందమూరి తారకరత్న చెప్పారు.
సినీ నటుడు నందమూరి తారకరత్న
చిలకలూరిపేటరూరల్, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీ తదితర హామీలన్నిటినీ పార్టీ అధినేత చంద్రబాబు తప్పకుండా నెరవేరుస్తారని సినీ నటుడు నందమూరి తారకరత్న చెప్పారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఆశీస్సులు, టీడీపీ, చంద్రబాబుపై విశ్వాసంతోనే విజయం సాధ్యమైందన్నారు. పసుమర్రులో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీమాంధ్రను సింగపూర్‌గా మార్చే సత్తా.. ప్రతి జిల్లాను హైదరాబాద్‌గా తీర్చిదిద్దే సామర్థ్యం చంద్రబాబుకే ఉన్నాయని పేర్కొన్నారు.
మంత్రివర్గ విస్తరణతో స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు మంత్రి పదవి లభించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. నందమూరి కుటుంబం అంతా ఒక్కటేనని, ఎన్నికల ప్రచారంలో పార్టీకి ఏ ఒక్కరూ దూరం కాలేదని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగినా తెలుగువారంతా ఒక్కటేనని, తన సినిమా విడుదలయితే తెలంగాణలో కూడా రిలీజ్ ఉంటుందన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ, సీమాంధ్ర రెండు కళ్ల వంటివన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు తేళ్ల సుధీర్ తదితరులు పాల్గొన్నారు.